సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 డిశెంబరు 2022 (22:05 IST)

కందుకూరులో అపశృతి... చంద్రబాబు సభలో తొక్కిసలాట - ఏడుగురి మృతి

kandukur meeting
టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చారు. ఇందులోభాగంగా, ఆయన బుధవారం రాత్రి కందుకూరులో రోడ్‌షోతో పాటు బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు జనం పోటెత్తారు. కందుకూరు రోడ్లన్నీ కిక్కిరిసి పోయాయి. ఆ సమయంలోనే అపశృతి చోటు చేసుకుంది. 
 
విపరీతమైన రద్దీ కారణంగా కార్యకర్తల మధ్య తొక్కిసలాట సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, మరికొందరు గాయపడ్డారు. చనిపోయిన వారిలో మర్లపాటి చినకొండయ్య, కాకుమాని రాజా, పురషోత్తం, కలవకూరి యానాది, దేవినేని రవీంద్రబాబు, యాటగిరి విజయ అనే వారు ఉన్నారు. మరో వ్యక్తి వివరాలు తెలియాల్సివుంది. 
 
ఈ ఘటనపై చంద్రబాబు స్పందిస్తూ, కొందరు నిండు ప్రాణాలు త్యాగం చేశారని చెబుతూ సభను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇది అత్యంత బాధాకరమైన ఘటన అని, కొన్ని సందర్భాల్లో మనం నిమిత్తమాత్రులం అవుతామని, విధఇరాత ఇలా ఉందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. అలాగే, గాయపడిన వారిని కూడా ఆదుకుంటామని వెల్లడించారు. 
 
తన 40 యేళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్ఘటన జరగలేదన్నారు. ఎపుడు కందుకూరు వచ్చినా ఆస్పత్రి సెంటర్‌లోనే సభ పెడుతుంటామని, కానీ ఈసారి దురదృష్టకర ఘటన జరిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సభను కొనసాగించడం భావ్యం కాదని, దీన్ని సంతాప సభగా భావించి మృతుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని తెలిపి, అదే విధంగా చేశారు. ఆ తర్వాత సభను అర్థాంతరంగా ముగించారు.