శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసు
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (16:32 IST)

డ్వాక్రా మహిళలు పదివేలు తిరిగి చెల్లించక్కర్లేదు... చంద్రన్న స్పష్టం

డ్వాక్రా సంఘాలకు చంద్రన్న హామీ ఇచ్చిన పదివేల రూపాయల మొత్తం అప్పేనంటూ దానిని తిరిగి వసూలు చేస్తారంటూ జగన్ స్వంత మీడియాలో వస్తున్న కథనంపై అధికార పక్షం మంత్రులు స్పందించారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాలను స్థాపించి ఆంధ్రప్రదేశ్ మహిళలను దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని కొనియాడారు. ఇవాళ రాష్ట్రంలో 94 లక్షల మంది మహిళలు సంఘాల్లో ఉండి ఆర్థికంగానూ, సామాజికంగానూ లాభాలు పొందుతున్నారంటే అది ఆయన దూరదృష్టి ఫలితంగాననీ, మహిళలపై ఆయనకున్న అభిమానమే కారణమన్నారు. 
 
పసుపు - కుంకుమ క్రింద అందజేస్తున్న మొత్తం సభ్యులకు పూర్తిగా గ్రాంటుగా ఇస్తున్నామని, ఈ నిధులను వారికి కావలసిన రీతిలో ఉపయోగించుకోవచ్చుననీ, దానిని తిరిగి కట్టాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ రోజు మహిళలకు చంద్రబాబు భాగస్వామ్యం కల్పించారన్నారు. ‘వెలుగు’ సంస్థను స్థాపించి సంఘాలను పటిష్ఠం చేసి దేశానికి ఆదర్శంగా నిలబెట్టారని తెలియజేసారు. ఏది ఏమైనప్పటికీ, అధికార పక్షం తరఫున డ్వాక్రా మహిళలకు వేయాల్సిన వల అయితే వేసేసారు గానీ అది ఎంత మేరకు గిట్టుబాటవుతుందో వేచి చూడాలి.