శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 29 జనవరి 2019 (11:32 IST)

మేడ్ ఇన్ ఆంధ్రా : కరువు సీమలో కియా కారు ఉత్పత్తి.. నేడు ట్రయల్ రన్

దేశ ఆటోమొబైల్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో మైలురాయికి చేరింది. మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా, కరువు సీమ అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీ కంపెనీలో తయారైన తొలి కారు ట్రయల్ రన్‌ను మంగళవారం నిర్వహించారు. సౌత్ కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం కియా కార్స్ తమ తొలి ఉత్పత్తిని మంగళవారం లాంఛ్ చేసింది. 
 
అనంతపురం జిల్లా పెనుగొండలో స్థాపించిన ఈ కంపెనీ... ట్రయల్ ప్రొడక్షన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కియా మోటర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కె.షిమ్, భారత్‌లో దక్షిణ కొరియా దేశ అంబాసిడర్ షిన్ బొంగ్ కిల్‌తో కలిసి ఈ హిస్టారికల్ కార్‌ను ఆవిష్కరించబోతున్నారు. 
 
కియా మోటర్స్ తయారు చేసిన కారు గురించి దేశంలోని టాప్ కార్ కంపెనీలు ప్రత్యేక దృష్టిపెట్టాయి. మొత్తం రూ.12,900 కోట్ల పెట్టుబడితో అనంతపురం జిల్లాలోని 513 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్ ప్లాంట్‌ను కియా మోటార్స్ కంపెనీ స్థాపించింది. యేడాదికి 3 లక్షల కార్లను ఉత్పత్తి చేసే లక్ష్యంతో ఏప్రిల్ 2017లో కియా మోటర్స్ సంస్థ ఏపీతో ఒప్పందం చేసుకుంది. 
 
డిమాండ్‌కు తగ్గట్టుగా దీనిని 4 లక్షల ఉత్పత్తికి పెంచేందుకు ప్రయత్నాలు చేస్తామని ఈ కంపెనీ యాజమాన్యం గతంలో ప్రకటించింది. వీటిలో 90 శాతం దేశీయంగా విక్రయించనుంది. మరో 10 శాతం కార్లను ఎగుమతి చేసేలా ప్రణాళికలు రూపొందించింది. ఈ కంపెనీలో నాలుగు వేల మందికి శాశ్వత ప్రాతిపదికన.. మరో 7 వేల మందికి తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించనుంది. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా కియా మోటార్స్ ఏపీలో ప్లాంట్‌ను నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ కంపెనీ గుజరాత్ లేదా తమిళనాడుల్లో ప్లాంట్ పెట్టాలని భావించింది. చివరకు ఏపీని ఎంచుకుని ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయడమే కాకుండా 18 నెలల్లోనే తొలి కారును ఉత్పత్తి చేసింది. 
 
కరువు సీమ అనంతపురంలో కియా కార్ల పరిశ్రమ.. రాయలసీమ అభివృద్ధికి… ఏపీలో ఆటోమొబైల్ పరిశ్రమకు, ఏపీ అభివృద్ధికి బంగారు బాటలు పరుస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కారు ఉత్పత్తితో దేశంలో కార్లు ఉత్పత్తి చేసే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చేరింది.