మంగళవారం, 15 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 జూన్ 2016 (10:26 IST)

అమరావతికి ఉద్యోగులు తరలి రావాల్సిందే: సీఎం చంద్రబాబు

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఉద్యోగులు తరలి రావాల్సిందేనని సీఎం చంద్రబాబు అన్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఉద్యోగులు తరలి రావాల్సిందేనని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవని, కష్టకాలంలో అందరూ కలిసిరావాలని ఆయన సూచించారు. కాగా, ఉద్యోగుల తరలింపు ప్రక్రియను వాయిదా వేయాలని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాన్ని విడదీసిన వారు విస్తుపోయేలా అభివృద్ధి సాధిద్దామన్నారు. 'చరిత్రలో ఒక మలుపులో ఉన్నాం. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే వెనుకబడిపోతాం. పట్టుదలతో శ్రమిస్తే ఊహించని ఫలితాలు సాధిస్తాం' అని అన్నారు. ఆదాయం 47 శాతం, జనాభా 58 శాతం ఏపీకి దక్కడంతో అనేక కష్టాలు ఎదుర్కొన్నామన్నారు. 
 
మొదటి సంవత్సరంలో రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటు ఉంటే కేంద్రం కేవలం రూ.2300 కోట్లు మాత్రమే భర్తీ చేసిందన్నారు. తొమ్మిది, పది షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థల విభజన ఇప్పటికీ పూర్తికాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో పొరుగు రాష్ట్రంతో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. గత రెండేళ్లలో ఆదాయం 3 శాతం పెంచామని, జాతీయ స్థాయి వృద్ధి కన్నా 3 శాతం ఏపీ ముందుందని పునరుద్ఘాటించారు.