1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (12:17 IST)

24 గంటల్లో మరో అల్పపీడనం.. 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు

భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది.

అయితే దీని ప్రభావం దక్షిణ తమిళనాడుతో పాటు శ్రీలంక దేశంపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
ఈ అల్పపీడన ప్రభావం తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 
 
అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీ వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో ఆగ్నేయ దిశగా గాలులు గంటకు 12 కిలోమీటర్లు వేగంతో వీస్తున్నాయని అధికారులు తెలిపారు.

దక్షిణ అండమాన్‌ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతం వరకు కొనసాగనుంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆకాశంలో పూర్తిగా మేఘాలు కమ్ముకున్నాయి.