ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By tj
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2017 (14:42 IST)

ఎస్‌ఐ బదిలీ అయితే గ్రామస్తులందరూ వెక్కివెక్కి ఏడ్చారు..!

ఆయనేమీ రాజకీయ నేత కాదు.. సినిమా హీరో అంతకన్నా కాదు. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తక్కువేమీ లేదు. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా. చిత్తూరు జిల్లా వి.కోట సబ్‌ఇన్పెక్టర్ రాజశేఖర్. హీరో రాజశేఖర్ సినిమాల్లో ప

ఆయనేమీ రాజకీయ నేత కాదు.. సినిమా హీరో అంతకన్నా కాదు. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తక్కువేమీ లేదు. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా. చిత్తూరు జిల్లా వి.కోట సబ్‌ఇన్పెక్టర్ రాజశేఖర్. హీరో రాజశేఖర్ సినిమాల్లో పోలీసు పాత్రకు వన్నె తెస్తే ఈ రియల్ పోలీస్ రాజశేఖర్ మాత్రం రియల్ లైఫ్‌లోనూ ఫ్రెండ్లీ పోలీస్‌గా అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నారు.
 
సాధారణంగా పోలీసులన్నా, పోలీస్టేషన్లన్నా జనానికి చాలా భయం. ఏదైనా సమస్య వస్తే పోలీస్టేషన్‌కు వెళ్ళే బదులు దాన్ని ఏదో లాగా తామే పరిష్కరించుకోవాలని ఎక్కువమంది భావిస్తారు. ఎందుకంటే పోలీస్టేషన్‌లో లంచాలు, పోలీసులు వేధింపు అలా ఉంటాయి మరి. అయితే అలాంటి పరిస్థితికి చెక్ పెడుతూ సరికొత్త పోలీసిజం అంటే ఏమిటో చూపించాడు ఆ ఎస్.ఐ. 
 
13 నెలల క్రితం వి.కోటకు సబ్‌ఇన్పెక్టర్‌గా బదిలీపై వచ్చిన రాజశేఖర్ అప్పటిదాకా పోలీస్టేషన్ అంటే ఏమిటో తెలియని వాళ్ళను సైతం స్టేషన్ మెట్లెక్కేలా చేశాడు. కేసులున్నా లేకపోయినా నిత్యం జనం పోలీస్టేషన్‌కే కేవలం ఎస్‌ఐని కలవడానికే వచ్చేవారంటే ఆయన జనంతో ఎంత మమేకమయ్యాడో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ముడుపులకు బాగా అలవాటుపడిపోయిన పోలీసులున్న సమాజంలో ఒక్కరూపాయి అవినీతి పాల్పడకపోవడమే కాదు తన సొంత ఖర్చుతో సమాజానికి తన చేతనైన సేవచేశాడు రాజశేఖర్. పోలీసోళ్లలో కూడా ఇలాంటి వారు ఉంటారా అనిపించేలా చేశాడు.
 
ఒకప్పుడు అధ్వాన్నంగా ఉన్న వి.కోట పోలీస్టేషన్ కేవలం సంవత్సరం కాలంలోనే అత్యాధునికత హంగులతో ఆదర్శ పోలీస్టేషన్‌గా తీర్చిదిద్దాడు. ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా ఊరి జనాలు చందాలు వసూలు చేసి మరీ పోలీస్టేషన్‌ను నిర్మించుకున్నారంటే జనంలో ఎస్‌ఐ పట్ల ఎంత నమ్మకం ఉందో తెలుసుకోవచ్చు. ఎస్‌ఐ రాజశేఖర్ ఇచ్చిన పిలుపుతో వి.కోట వాసులంతా కలిసి రూ.25 లక్షల  సొంత ఖర్చుతో పోలీస్టేషన్‌కు వెచ్చించారు. ఇక యువతలోనూ రాజశేఖర్ అంటే ప్రత్యేక క్రేజ్ ఉంది. స్థానికంగా ఉన్న కాలేజీలలో గ్రూపు తగాదాలను అరికట్టి విద్యార్థులు లక్ష్యంవైపు వెళ్ళేలాగా ప్రత్యేక కౌన్సిలింగ్‌లు ఇచ్చారు రాజశేఖర్. 
 
అంతేకాదు పేద విద్యార్థులకు సొంత ఖర్చులతో చదువులో ఆసరా కల్పించాడు. అంతవరకు పోలీసలంటేనే హడలి పోయే ఆటో వాలాలకు ఆ భయం పోగొట్టి వారు సొంత కాళ్ళపై నిలబడేలా స్నేహస్తాన్ని ఆటోవాలాలకు అందించి తమతో కలుపుకున్నాడు. నిబంధనలు పాటిస్తే ఎవరికీ భయపడాల్సిన పనిలేదంటూ హామీ ఇచ్చి నిరుద్యోగులు సొంత కాళ్ళపై ఆటోలు నడుపుకునేలా చేశాడు. దీంతో ఆ ఊర్లో ఏ ఆటోడ్రైవర్‌ను కదిలించినా ఎస్‌ఐ రాజశేఖర్ గొప్పతనం గురించే చెబుతుంటారు. ఒకరిద్దరు మాత్రమే కాదు.. గ్రామంలోని వారందరూ రాజశేఖర్ అంటే తమ ఇంటిలో ఒకరిగా భావిస్తుంటారు. 
 
గ్రామస్తుల ఆదరాభిమానాలు చూరగొనడంతో రాజశేఖర్ బదిలీపై వెళుతుంటే కన్నీళ్ళు ఆపులేకపోయారు. బదిలీ విషయం తెలిసిన విద్యార్థుల నుంచి ఆటోడ్రైవర్లు, రైతులు, ప్రజలు పోలీస్టేషన్‌కు తరలివచ్చి బోరున విలపించారు. రాజశేఖర్ వెళ్ళిపోతుండడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులైతే కళాశాలకు తీసుకెళ్ళి సన్మానం చేసి ఘన వీడ్కోలు పలికారు.