ఇక క్లీన్ ఆంధ్రప్రదేశ్, ఇంటికి 3 డస్ట్ బిన్లు పంపిణీ
ఏపీలో ఇక క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రారంభమవుతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 124 మున్సిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో 1.2 కోట్ల బిన్‌లు ఇవ్వనున్నారు. అంటే, 40 లక్షల ఇళ్ళకు, ఇంటికి మూడు చొప్పున బిన్‌లు ఇస్తారు. అందులో గ్రీన్, బ్లూ, రెడ్ కలర్స్‌లో బిన్‌లు ఉంటాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు.
కార్పొరేషన్ల, మున్సిపాలిటీల సమీక్ష సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఇంటింటా వ్యర్ధాల సేకరణకు 4, 868 వాహనాలు కావాలని, ఇందులో 1,771 ఎలక్ట్రిక్ వాహనాలుంటాయని చెప్పారు. మొదటి ఫేజ్‌లో 3097 వాహనాలు ఏర్పాటు చేస్తామన్నారు.
225 గార్బేజ్ ట్రాన్స్‌పోర్ట్ స్టేషన్లు ఏర్పాటు చేసి, సేకరించిన వ్యర్ధాలను వివిధ విధానాల్లో ట్రీట్ చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సేకరించిన వ్యర్ధాల్లో 55 నుంచి 60శాతం వరకూ తడిచెత్త ఉంటుంది, దీన్ని బయోడీగ్రేడ్ విధానంలో ట్రీట్ చేస్తారు. 35 నుంచి 38 శాతం వరకూ పొడిచెత్త రూపంలో ఉన్న దాన్ని రీసైకిల్ చేస్తారు.
మరికొంత మొత్తాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తారు. ఇంకా 10–12 శాతం ఇసుక తదితర రూపంలో ఉంటుంది. దీన్ని ఫిల్లింగ్‌కు వాడుతారు. 72 పట్టణాల్లో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని, దీనికోసం ఆగస్టు 15 కల్లా టెండర్ల ప్రక్రియ, జులై 2022 కల్లా ఏర్పాటుకు కార్యాచరణ కావాలని సీఎం ఆదేశించారు.
మున్సిపాల్టీలు, నగరాల్లో రోడ్ల మరమ్మతుకు చర్యలు తీసుకోవాలని, రోడ్లు భవనాల శాఖతో సమన్వయం చేసుకుని కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వర్షాకాలం ముగియగానే రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న సీఎం ఆదేశించారు.