మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 30 మే 2020 (15:13 IST)

ఒక్క క్లిక్‌తో 10641 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఒక్క క్లిక్‌తో ఒకేసారి 10641 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. విజయవాడ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈ కేంద్రాలను ప్రారంభించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే ఓ రైతు.. రైతు భరోసా యాప్ ద్వారా తనకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ఆర్డర్ ఇవ్వగా, వీటిని 48 గంటల్లో గ్రామీణ ప్రాంతంలోని ఇంటికి కూడా సరఫరా చేయనున్నారు. అంతేకాకుండా, రైతు భరోసా కేంద్రాల నుంచి రైతులు కొనుగోలు చేసే విత్తనాలు, పురుగుమందులు, ఎరువులకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది. అంతేకాకుండా, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ మెళకువలపై కూడా శిక్షణ ఇవ్వనుంది. 
 
ఈ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించిన తర్వాత రైతులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు తమ గుప్పిట్లోనే పెట్టుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు చూస్తోంటే కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇటువంటి ప్రతిపక్షాన్ని ఇక్కడే చూస్తున్నాం. ఆంగ్ల మాధ్యమాన్నీ అడ్డుకుంటున్నారు. మేము మేనిఫెస్టోలో చెప్పనివేకాకుండా చెప్పకుండా అమలు చేసినవీ 40 అంశాలున్నాయి అని వ్యాఖ్యానించారు.
 
ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి, రైతుభరోసా కేంద్రాలతో గ్రామాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుంది. రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అన్నీ రైతుభరోసా కేంద్రాల్లో లభ్యం అవుతాయి. రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం వైసీపీది. మనందరి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రైతులతో గడపడం చాలా సంతోషంగా ఉందన్నారు.
 
ఇకపోతే, వైకాపా ప్రభుత్వం ఏర్పాటై ఒక యేడాది ముగించుకుంది. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వచ్చి 11 ఏళ్లు అయిందన్నారు. తమ ఏడాది పాలన పూర్తి నిబద్ధతతో కొనసాగిందని చెప్పగలనని వ్యాఖ్యానించారు. తాను రాష్ట్రం నలుమూలలా కోట్లాది మందిని కలిశానని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశానన్నారు.
 
రాష్ట్రంలో ప్రజలు చదువు, వైద్యం అందక అప్పులపాలవుతోన్న పరిస్థితులను తాను గమనించానని జగన్ తెలిపారు. గుడి, బడి పక్కన, వీధుల్లో మద్యం అమ్ముతున్న పరిస్థితులను గమనించానని చెప్పారు. ప్రజల జీవితాలను మార్చాలన్న ఆలోచన చేశానని చెప్పారు.
 
అన్నింటినీ తెలుసుకునే నవరత్నాలను అమలు చేస్తున్నామని, ఇప్పటికే 90 శాతం హామీలను అమలు చేశామని జగన్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో అందరి దగ్గరా ఉండేలా చూశామన్నారు. మేనిఫెస్టోను ఐదేళ్ల కాలానికి రూపొందించామని తెలిపారు. ఇప్పటివరకు 129 హామీలు అమలు కాగా, మరో 77 అమలుకావాల్సి ఉందని సీఎం జగన్ చెప్పుకొచ్చారు.