జగన్ లాంటి సీఎం మళ్లీ దొరకడు : వందకు 110 మార్కులు వేస్తా : జేసీ దివాకర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్. జగన్మోహన్ రెడ్డి వంటి ముఖ్యమంత్రి మళ్లీ దొరకడని, ఆయనకు వందకు వంద మార్కులు వేస్తానని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం ఏర్పాటై ఒక యేడాది పూర్తి చేసుకుంది. దీనిపై జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ, జగన్ పట్టుదల పరాకాష్టకు చేరిందనటానికి హైకోర్టు తీర్పే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.
తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అనటాన్ని జగన్ మానుకోవాలని సూచించారు. రాజ్యాంగం జోలికి వెళ్తే ఇలాంటి తీర్పులే వస్తాయని ప్రభుత్వానికి ముందే తెలుసని, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్ళడం ప్రభుత్వం ఇష్టమన్నారు.
జగన్ శ్రీరాముడో.. రావణుడో ప్రజలే తేల్చుకోవాలని దివాకర్‌రెడ్డి చెప్పారు. చరిత్ర అనే పుస్తకంలో తనకు ఒక్క పేజీ ఉండాలనేది జగన్ ఆలోచన అని వ్యాఖ్యానించారు. తితిదే ఆస్తులు అమ్మాలని వైవీ.సుబ్బారెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం జగన్ సంక్షేమంపై దృష్టిసారించారని, సంక్షేమానికి ఓట్లు పడవన్న విషయం 2019లో తేలిందని జేసీ దివాకర్‌రెడ్డి గుర్తుచేశారు.