శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By వి
Last Modified: మంగళవారం, 26 మే 2020 (15:40 IST)

ఇలా చేస్తే పరిపూర్ణ ఆరోగ్యం సొంతం

మనిషికి భగవంతుడిచ్చిన వరప్రసాదం వేదాలు. ఈ వేదాలు నాలుగున్నాయి. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణవేదం. ఈ నాలుగు వేదాలతోపాటు ఆయుర్వేదాన్ని పంచమ వేదంగా కొనియాడబడుతోంది. ఆయుర్వేద శబ్దం రెండు శబ్దాల కలయికతో ఏర్పడింది. ఆయుః+ వేదం= ఆయుర్వేదం.
 
ఆయుః అంటే జన్మ-మృత్యుపర్యంతం జీవితంలో వచ్చే అన్ని అంశాలు. వేదం అంటే జ్ఞానం. ఆయుర్వేదం అనేది ఆయుష్షు విజ్ఞానాన్ని తెలిపేది. ఇది మనిషి జీవితంలో ఎలా జీవించాలి అనే దానిని తెలుపుతుంది. ప్రకృతి పరంగా మనిషి ఎలా జీవించాలనేది ఈ శాస్త్రం చెబుతుంది. సమతుల్యమైన ఆహారం, ఆలోచనలు, నిద్ర, మైథునం తదితర అంశాలను ఆయుర్వేద బోధిస్తుంది.
 
ఇందులో మనిషి ఏయే పనులు చేయాలి, ఏయే పనులు చేయకూడదు అనే అంశాలను తెలుపుతుంది. ఆయుర్వేదం ద్వారా రోగులకు రోగాల నుంచి ఎలా ముక్తి పొందాలి. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపే ఆరోగ్యవంతులు మరింత ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి తదితర అంశాలను తెలిపేదే ఆయుర్వేదం.
 
ఆరోగ్యవంతమైన వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం, జబ్బులతో కూడుకున్న రోగి ఆరోగ్యాన్ని మరింతగా నయం చేయడమే ఆయుర్వేద వైద్య విధానమని ఆయుర్వేద వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయుర్వేద వైద్యంలో తెలిపిన కొన్ని ప్రాథమిక అంశాలను మనిషి ప్రతి రోజు పాటిస్తుంటే నిత్యం ఆరోగ్యవంతునిగా జీవితాన్ని గడపవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆయుర్వేద చికిత్సా విధానంలో ప్రాతఃకాలం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎలా సమయాన్ని గడపాలి, దీని కొరకు మనిషి తన దినచర్యను ఎలా పాటించాలనేది ఇందులో ప్రధాన అంశాలు.
 
ప్రాతఃకాలం నిద్రనుండి మేల్కొనాలిః సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలనుకునే వ్యక్తులు ప్రాతఃకాలం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేవాలి. ఈ సమయంలో నిద్రలేచే వ్యక్తులు ఆరోగ్యవంతులుగా ఉంటారు. విద్య, బలం, తేజస్సు, ధనం సమృద్ధిగా ఉంటాయి. ఎవరైతే సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోతుంటారో వారి ఆయుష్షు క్షీణించడంతోపాటు శరీరంలోని శక్తి నశిస్తుంది. ఇలాంటి వ్యక్తులు రకరకాల జబ్బులతో బాధపడుతుంటారని ఆయుర్వేద వైద్యం చెబుతోంది.
 
ఉషఃపానం : ప్రాతఃకాలం నిద్రలేచిన తర్వాత మలమూత్రాదులను విసర్జించే ముందు చల్లటి నీటిని సేవించాలి. రాత్రి పడుకునే ముందు రాగిపాత్రలో నీటిని భద్రపరచుకోవాలి. నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని సేవిస్తే ఆరోగ్యంగా ఉంటారు. నిద్ర లేచిన తర్వాత కనీసం అరలీటరు వీలైతే ఒక లీటరు నీటిని సేవిస్తే మరీ మంచిదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఇలా నీటిని సేవించడం వలన శరీరంలోనున్న కఫం, వాయు, పిత్త దోషాలు నశిస్తాయి. దీంతో వ్యక్తి బలశాలి, దీర్ఘాయుష్మంతుడుగా మారుతాడు. ఉదరం పూర్తిగా శుభ్రపడుతుంది.