ప్రధానిని విమర్శించకూడదని రాజ్యాంగంలో వుందా?: కేసీఆర్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ 2019 ఎన్నికల్లో ఒక్క సీటు గె
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కేసీఆర్ శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ 2019 ఎన్నికల్లో ఒక్క సీటు గెలవదన్నారు. ప్రధాన మంత్రిని కించపరచానని బీజేపీ నేతలు అనుకుంటే అనుకోమన్నారు. ప్రధానిని విమర్శించవద్దని రాజ్యాంగంలో వుందా అంటూ ప్రశ్నించారు.
రిజర్వేషన్లపై సవరణలు చేయొచ్చునని.. ఈ నెల 5 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో స్టేట్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్‌లో పొందుపరిచిన అన్నీ అంశాల అమలుపై కేంద్రాన్ని నిలదీస్తామని కేసీఆర్ ఉద్ఘాటించారు. కేంద్రంలో ఎవరున్నా రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిందేనని కేసీఆర్ పునరుద్ఘాటించారు. ప్రధానిని విమర్శిస్తే.. కేసీఆర్‌కి జైలుకు పోవాలని వుందా అంటూ బీజేపీ నేతలు అంటున్నారని.. మాట్లాడిన వారినందరినీ జైలుకి పంపిస్తారా? అని కేసీఆర్ నిలదీశారు.
జేబులో పెట్టుకున్న పెన్ వరకు తన వద్ద లెక్కలున్నాయని.. అక్రమ సంపాదనకు పాల్పడే వారే భయపడతారని.. తాను కాదని కేసీఆర్ సవాల్ విసిరారు. ప్రధాన మంత్రిని ''గారు'' అని సంబోధించానే కానీ.. అనుచిత వ్యాఖ్యలు చేయలేదని కేసీఆర్ వివరణ ఇచ్చారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఆర్టికల్ 16ను సవరణ చేయొచ్చునని.. అలా చేస్తే బిల్లు కూడా పాస్ అవుతుంది. కాకపోతే కేంద్రం తన పెత్తనాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. వాళ్ల గుప్పిట్లో పవర్ పెట్టుకోవాలనుకుంటోందని కేసీఆర్ విమర్శలు గుప్పించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారో లేదో స్పష్టం చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం రావాలని కేసీఆర్ తెలిపారు. ఫ్రంట్, కూటమిపై ఆలోచన జరగాలన్నారు. అది థర్డ్ ఫ్రంట్ కాదు.. మెయిన్ ఫ్రంట్ కావాలని కేసీఆర్ తెలిపారు.