శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (14:07 IST)

తెదేపాపై బీజేపీ రాయలసీమ అస్త్రం.. ఎందుకంటే..?

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీపై భారతీయ జనతా పార్టీ రాయలసీమ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేసిందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీపై భారతీయ జనతా పార్టీ రాయలసీమ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఇటీవల కర్నూలులో సమావేశమైన ఆ పార్టీ నాయకులు రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఓ తీర్మాన పత్రాలను రిలీజ్ చేసింది. 
 
సీమలో రెండో రాజధాని కేంద్రం ఏర్పాటు చేయాలని, సీమకు రూ.20 వేల కోట్ల నిధులు కేటాయించాలని, హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఇంకా చాలా డిమాండ్లను తెరపైకి తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమను నిర్లక్ష్యం చేస్తోందని కూడా విమర్శించింది. బీజేపీ జాతీయ జాతీయ అధ్యక్షులు అమిత్ షా త్వరలో రాయలసీమలో పర్యటిస్తారని కూడా ఆ పార్టీ ప్రకటించింది. 
 
భారతీయ జనతా పార్టీ ఆకస్మికంగా రాయలసీమ సమస్యలపై మాట్లాడటం, డిక్లరేషన్ ఒకటి విడుదల చేయడం, అమిత్ షా పర్యటన ఏర్పాటు చేయడం ఇవన్నీ ఆ పార్టీ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులుగా పరిశీలకులు భావిస్తున్నారు. ముందుగా తను ప్రశ్నిస్తున్న టీడీపీని ఇరుకున పెట్టడమే బీజేపీ వ్యూహంలోని మొదటి లక్ష్యం. అయితే బీజేపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలున్నాయి. 
 
నవ్యాంధ్రలో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం సీమను తీవ్రంగా నిర్యక్ష్యం చేస్తోంది. సీమ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. దశాబ్దాల నాటి హంద్రీ-నీవా, గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లో ఉండగా పట్టిసీమ, పురుషోత్తమపట్నం అంటూ కోస్తాలో వేల కోట్లు ఖర్చు చేస్తోంది. అవే నిధులు ఇక్కడ ఖర్చు చేసి ఉంటే సీమ ప్రాజెక్టులు పూర్తయ్యేవి.
 
సీమలో హైకోర్టు పెట్టాలన్న డిమాండ్‌ను చెవికెక్కించుకోకుండా అమరావతిలోనే ఏర్పాటు చేసేందుకు సిద్ధంమైంది. వెనుకబడిన జిల్లాలకు కేంద్రం కేటాయించిన అరకొర నిధులు కూడా ఇక్కడ ఖర్చు చేయలేదు. ఇప్పటికీ తాను సీమకు చేస్తున్న అన్యాయాన్ని గుర్తించడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. నేనూ రాయలసీమ వాసినే.. సీమకు ఏం అన్యాయం జరిగింది.. అంటూ ఎదురుప్రశ్న వేస్తున్నారు. నిజంగా ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఏ సీమ ఉద్యమకారుడైనా చెప్పగలడు. అలాంటిది అధికారంలో బీజేపీ పక్కా లెక్కలతో సహా చెప్పగలదు. వాస్తవంగా బీజేపీ లేవనెత్తిన అంశాలన్నీ చాలా రోజులుగా సీమ ఉద్యమకారులు చెబుతున్నవే. 
 
రాయలసీమ అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడినా స్వాగతించాల్సిందే. బీజేపీ కూడా మాట్లాడొచ్చు. అయితే అంతకన్నా ముందే సీమ ప్రజలకు ఆ పార్టీ వివరణ ఇవ్వాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలకు బుందేల్‌‌‌‌‌‌‌‌ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని విభజన చట్టంలో చెప్పారు. బుందేల్‌ఖండ్‌లో 10 యేళ్ళ క్రితమే రూ.7 వేల కోట్లు ఇచ్చారు. 
 
ఇప్పటిలెక్కల ప్రకారమైతే కనీసంగా రూ.20 వేల కోట్లు ఇవ్వాలి. కానీ యేడాదికి జిల్లాకు రూ.50 కోట్ల వంతున మూడేళ్ళు ఇచ్చారు. సీమలోని నాలుగు జిల్లాలకు కలిపి రూ.600 కోట్లు మాత్రమే ఇచ్చారు. రూ.20 వేల కోట్లు ఎక్కడ? రూ.600 కోట్లు ఎక్కడ?. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో సాంకేతిక ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు. సీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో ఏ ఇబ్బందీ లేదు. పైగా చట్టంలో ఉంది. మరెందుకు సీమకు ప్యాకేజీ ఇవ్వలేదో బీజేపీ నాయకులు చెప్పడం లేదు. సీమ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉంది. 
 
కడప ఉక్కు ఊసే లేకుండా పోయింది. చిత్తూరు జిల్లాలోని మన్నవరం పరిశ్రమను కుదించేసి 10 వేల మందికి ఉపాధి లభించాల్సిన చోట 50 మంది ఉద్యోగులకు పరిమితం చేశారు. ఇలాంటివన్నీ కేంద్రం చేయాల్సిన పనులే. ఈ నాలుగేళ్ళలో ఎందుకు చేయలేదో చెప్పకుండా ఇప్పుడు రాయలసీమ డిక్లరరేషన్ పేరుతో డిమాండ్లను ముందుకు తేవడాన్ని రాజకీయ ఎత్తుగడగా మాత్రమే సీమ ప్రజలు అర్థం చేసుకుంటారు. సీమను రాష్ట్రం ఎంత నిర్లక్ష్యం చేసిందో కేంద్రమూ అంతే నిర్లక్ష్యం చేస్తోందన్న అభిప్రాయాన్ని రాయలసీమ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది.