సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 డిశెంబరు 2020 (16:36 IST)

ఎంత మొత్తుకున్నా ఇప్పట్లో పంచాయతీ పోరు నిర్వహించలేం : ఏపీ సర్కారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొండిపట్టుపట్టింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంతవరకు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జోలికి వెళ్లకూడదని భీష్మించి కూర్చొంది. ఇదే విషయాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానానికి కూడా తెలిపింది. 
 
వచ్చే యేడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. కానీ, ఏపీ సర్కారు దీనికి ససేమిరా అంటోంది. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై ఇప్పటికే పలు దఫాలుగా విచారణ జరిగింది. తాజాగా మంగళవారం కూడా మరోమారు విచారణ జరిగింది. 
 
ఏపీ ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కరోనా వాక్సినేషన్ ప్రక్రియపై కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిందని, ఈ వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహణకు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బందిని వినియోగించాల్సి ఉందని తెలిపింది. మొదటి డోస్ వేసిన నాలుగు వారాల తర్వాత రెండో డోస్ వేయాలని కేంద్రం సూచించిందని పేర్కొంది. 
 
పైగా ఎన్నికల ప్రక్రియలాగానే వాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించాల్సి ఉందని, ప్రజారోగ్యం దృష్ట్యా వాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యమివ్వాల్సి ఉందని అఫిడవిట్‌లో తెలిపింది. అందువలన ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. 
 
దీనికి ఎస్ఈసీ తరపు న్యాయవాది మాట్లాడుతూ, ప్రభుత్వం సమర్పించిన అడిషనల్ అఫిడవిట్ తనకు గత రాత్రి అందిందని కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరడంతో తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి హైకోర్టు వాయిదావేసింది.