బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (08:03 IST)

21 నుంచి ఏపీలో సమగ్ర భూ సర్వే

ఏపీలో ‘వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం’ ఈ నెల 21న ప్రారంభమవుతుంది. గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలు, నగరాలతో కలిపి అటవీ ప్రాంతాలు మినహా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర 17,460 గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నారు.

అధికారులు భూ సమగ్ర సర్వేకు సంబంధించిన ప్రణాళికను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి వివరించారు. మొదటి విడతలో 5000, రెండో విడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు.

పట్టణాలు, నగరాల్లోని 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే నిర్వహించనుండగా, మొత్తం 10 లక్షల ఓపెన్‌ ప్లాట్లు, 40 లక్షల అసెస్‌మెంట్ల భూముల్లో, 2.26 కోట్ల ఎకరాలు ఉన్న 90 లక్షల మంది పట్టాదారుల భూములు సర్వే చేయాల్సి ఉంటుందని తెలిపారు.

సర్వే తర్వాత ల్యాండ్‌ టైటిలింగ్‌ కార్డు ఇస్తామని, దీనిలో యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబరు ఉంటుందన్నారు. ప్రాపర్టీ (భూమి) కొలతలతోపాటు, మొత్తం ఏరియా, యజమాని పేరు, ఫొటో, క్యూ ఆర్‌ కోడ్‌ కూడా ఉంటుందన్నారు. సర్వే పూర్తైనతర్వాత డిజిటైజ్డ్‌ కాడిస్టల్‌ మ్యాప్‌లు తయారు చేస్తామని, గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలు మ్యాప్‌లో ఉంటాయని వివరించారు.

భూ కొలతలు పూర్తైనతర్వాత సర్వే రాళ్లు వేస్తారని, గ్రామ సచివాలయంలో డిజిటైజ్డ్‌ ప్రాపర్టీ రిజిస్టర్‌, టైటిల్‌ రిజిస్టర్‌తోపాటు, వివాదాల నమోదుకూ రిజిస్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాదాపు 9,400 మందికి మొత్తానికి సర్వే ఆఫ్‌ ఇండియా శిక్షణ ఇస్తోందని, ప్రతి మండలానికి ఒక డ్రోన్‌ బందం, డేటా ప్రాసెసింగ్‌ టీం, రీసర్వే టీం ఉంటాయని అధికారులు వివరించారు.

ఒక గ్రామంలో సర్వే పూర్తయి మ్యాపులుసిద్ధం కాగానే అదే గ్రామ సచివాలయంలో ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ సేవలు వెంటనే ప్రారంభం కావాలని సీఎం జగన్‌ ఆదేశించారు. భూ వివాదాల పరిష్కారానికి మొబైల్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేయాలని, దీనికి అవసరమైన వాహనాలతో సహా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సమగ్ర భూ సర్వే ద్వారా ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ప్రజల్లో సందేహాలు రేకెత్తించి ఈ కార్యక్రమానికి అవాంతరాలు కలిగించడానికి కొందరు విష ప్రచారాలు చేస్తున్నారని సీఎం పరోక్షంగా ప్రతిపక్షాలను విమర్శించారు.

సమగ్ర సర్వేపై కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని, తప్పుడు సమాచారం, ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్వే పూర్తయ్యాక ఆ రికార్డులను మరెవ్వరూ టాంపర్‌ చేయలేని రీతిలో భద్రపరచాలని, సెక్యూరిటీ ఫీచర్స్‌ పటిష్టంగా ఉండాలని స్పష్టం చేశారు.

భూ యజమానుల వద్ద హార్డ్‌ కాపీ ఉండేలా చూడాలన్నారు. సర్వే శిక్షణ కోసం తిరుపతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా ఒక కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.