శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (20:42 IST)

ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన... కేంద్ర న్యాయశాఖా మంత్రికి 3 పాయింట్లు, ఏంటవి?

ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని అమరావతిలోని అధికార నివాసానికి ఈ సాయంత్రం చేరుకున్నారు.

నిన్న కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన సీఎం, ఇవాళ కేంద్ర న్యాయశాఖ, ఎలక్ట్రానిక్స్‌ మరియు ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. మూడు అంశాలను రవిశంకర్‌ ప్రసాద్‌ దృష్టికి తీసుకు వచ్చారు.
 
 
1. రాజధాని కార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ అంశాన్ని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. దీనికోసం రాజధాని కార్యకలాపాలను మూడు ప్రాంతాలకు వికేంద్రీకరించామని, ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌‌గా అమరావతి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని న్యాయశాఖమంత్రికి వెల్లడించారు.

దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020 కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని సీఎం వివరించారు. దీంట్లో భాగంగా హైకోర్టును కర్నూలు తరలించడానికి కేంద్ర న్యాయశాఖ తగిన చర్యలను తీసుకోవాలని కోరారు.

రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ 2019 మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాన్ని కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకు వెళ్లారు. 
 
 
2. శాసనమండలి రద్దు అంశాన్నికూడా కేంద్రమంత్రితో సీఎం చర్చించారు. దీనికి సంబంధించి తదనంతర చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనమండలి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నంచేసి ప్రజాస్వమ్యాన్ని అపహాస్యం చేసిందని కేంద్రమంత్రికి వివరించారు. 
 
ఈ నేపధ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ,  శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్‌ చేసిందని, కేంద్ర న్యాయశాఖ చర్యలు తదుపరి తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు. 
 
3. మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రవేశపెట్టిన దిశ చట్టాన్నికూడా సీఎం కేంద్ర మంత్రికి వివరించారు.

వీలైనంత త్వరగా దిశ చట్టం అమల్లోకి తీసుకు వచ్చేలా న్యాయశాఖ తరఫున ప్రక్రియను వేగవంతం చేయాలని రవిశంకర్‌ ప్రసాద్‌ను సీఎం కోరారు. చట్టం అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.