గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 3 మార్చి 2021 (16:19 IST)

కరోనా ప్రభావం, తితిదే బడ్జెట్‌లో ఇంత కోతా..?

తిరుమల శ్రీవారి ఆదాయంపైన కరోనా ప్రభావం చూపింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక బడ్జెట్లోను కోత పడింది. గత యేడాదితో పోలిస్తే ఈ యేడాది 370 కోట్లకు పైగానే బడ్జెట్ తగ్గింది. అఖిలాండ బ్రహ్మాండనాయకుడి దర్సనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుపతికి వస్తుంటారు. హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.
 
ఇదే టిటిడికి ప్రధాన ఆదాయ వనరు. ప్రతి యేడాది స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు పెరుగుతూ ఉండటంతో వార్షిక బడ్జెట్ కూడా పెరుగుతూ వచ్చింది. అయితే టిటిడి చరిత్రలో మొట్టమొదటిసారిగా కోవిడ్ కారణంగా బడ్జెట్ అంచనాలు తగ్గాయి. గత యేడాది 3,309కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్థం చేసిన టిటిడి ఆర్థిక శాఖ కరోనా కారణంగా ఈ యేడాది 2,937 కోట్ల రూపాయల అంచనాతో సిద్థం చేసింది. 
 
కరోనా కారణంగా 80 రోజుల పాటు శ్రీవారి ఆలయం మూతపడింది. తరువాత కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులు దర్సనానికి అనుమతిస్తుండటంతో హుండీ ద్వారా 1,350 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేయగా 731 కోట్లు మాత్రమే వచ్చింది.
 
ఈ యేడాది హుండీ ద్వారా 1,131 కోట్ల రూపాయల కానుకలు లభిస్తాయని అంచనా వేశారు అధికారులు. ఇక 10,875 కోట్ల ఫిక్స్ డిపాజిట్ల ద్వారా 533కోట్ల రూపాయలు వడ్డీ వస్తుందని అంచనా వేశారు. గత యేడాది వడ్డీ రూపంలో 738 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈ యేడాది 200 కోట్ల రూపాయల తక్కువ అంచనా వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
స్వామివారి లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా 375 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. గత యేడాది లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా 170 కోట్ల రూపాయల ఆదాయం రాగా ఈ యేడాది అదనంగా మరో 205 కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.
 
దర్సనం టిక్కెట్ల విక్రయాల ద్వారా 210 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందనే అంచనా వేశారు. గత యేడాది దర్సన టిక్కెట్ల విక్రయం ద్వారా కేవలం 147 కోట్ల రూపాయలు ఆదాయం మాత్రమే లభించింది. ఇక భక్తులు సమర్పించే తలనీలాల విక్రయం ద్వారా 131 కోట్లు వసతి గదుల అద్దెల ద్వారా 93 కోట్లు.. ఆర్జిత సేవా టిక్కెట్ల ద్వారా 70 కోట్లు, మొత్తం 2,937 కోట్ల రూపాయలతో 2021-22 సంవత్సరానికి లభిస్తుందని అంచనా వేసింది టిటిడి.
 
2021-22 యేడాదికి సంబంధించిన వ్యయం కూడా అదే రీతిలో ఉంది. ఉద్యోగుల జీతాలకే 1,308 కోట్ల రూపాయలు కేటాయించింది టిటిడి. ముడిసరుకుల కొనుగోలుకు 385 కోట్లు, ఇంజనీరింగ్ శాఖకు 480 కోట్లు, తిరుపతిలో నిర్మిస్తున్న గరుడ వారధికి 50 కోట్లు, స్విమ్స్ ఆసుపత్రికి 50 కోట్లు, హిందూ ధార్మిక ప్రచారానికి 109 కోట్లు కేటాయించింది. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడులు 150 కోట్లరూపాయలు, ఉద్యోగుల పెన్షన్‌కు 75 కోట్లు రూపాయలు, విద్యుత్ ఛార్జీలకు 45 కోట్లు, గ్రాంట్ల చెల్లింపులకు 91 కోట్లు ఇలా 2,937 కోట్లను సిద్థం చేశారు అధికారులు.