శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 24 ఆగస్టు 2020 (18:32 IST)

కరోనా ఎఫెక్ట్: వినాయకుడిని ప్రతిష్ఠించిన అర్థగంట లోపే నిమజ్జనం చేశారు

వికారాబాద్‌లో రాత్రి 9 గంటలకు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు, రాత్రి 11 గంటలకే నిమజ్జనం చేశారు, ఏమైంది? కరోనావైరస్. ఈ వైరస్ పండగను కూడా చేసుకోనివ్వలేదు. చవితి పండుగ రోజు ఎంతో కష్టపడి వినాయకుడి విగ్రహాన్ని తీసుకుని వచ్చి ప్రతిష్టిస్తే... ప్రార్థించే సమయం కూడా లేకుండా నిమజ్జనం చేశారు. ఇంతకీ ఏమైందంటే?
 
వినాయకచవితి నాడు వినాయక మండపానికి అనుమతిలేదు. అయినప్పటికీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ కారణంతో వినాయకుడిని ప్రతిష్ఠించిన అర్థగంటకే నిమజ్జనం చేశారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట్ గ్రామంలో జరిగింది. ఇక్కడ మారుతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతియేటా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
 
ఐతే ఈసారి కరోనా నేపధ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ఈసారి కూడా గణపతి విగ్రహాన్ని అక్కడికి తీసుకొచ్చారు. విషయం తెలిసి పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఫలితంగా శనివారం రాత్రి 9 గంటలకు ప్రతిష్ఠించిన వినాయకుడిని రాత్రి 11 గంటలకే నిమజ్జనం చేసేశారు.
 
తాము నియమాలు ‌‌పాటిస్తూ ఉత్సవాలు జరుపుకుందామనుకునేలోపే పోలీసులు అడ్డుకోవడమే కాకుండా తమతో బలవంతంగా నిమజ్జనం చేయించారని యూత్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఐతే దౌల్తాబాద్ ఎస్సై మాత్రం ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. కరోనా నియమాలను పాటిస్తూ ఉత్సవం చేసుకోవాలని తాము చెబితే, అలా మేం చేయలేమంటూ వినాయక విగ్రహాన్ని తీసుకుని వెళ్లి నిమజ్జనం చేశారని చెపుతున్నారు.