శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (10:14 IST)

కరోనా వైరస్ సోకిన వృద్ధుడు రోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయాడు...

తెలంగాణలో కరోనా వైరస్ సోకిన వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే కనీస వైద్యం అందకుండా ఓ వృద్ధుడు రోడ్డుపైనే మృతి చెందాడు.

వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని లాలాపేట ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, కింగ్ కోఠి ఆసుపత్రి ఎవరూ నృద్ధుడిని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోలేదు. అందరూ కరోనా లక్షణాలు వున్నాయని నిర్ధారించారు కానీ పేషంట్‌ను జాగ్రత్తగా వుంచి చికిత్స అందించలేదు. దీంతో కరోనా లక్షణాలతో నేపాల్‌కు చెందిన ఓ వృద్ధుడు రోడ్డుపైనే ప్రాణాలు వదిలాడు. 
 
హాస్పిటల్ నుంచి నడుచుకుంటూ వస్తూ నారాయణగూడ పరిధిలోని శాంతి థియేటర్ వద్ద పడిపోయి మృతి చెందాడు. నేపాల్‌కు చెందిన ఈ 70 ఏళ్ల బహదూర్ లాలాపేటలోని ఓ బార్‌లో పని చేస్తాడు. జలుబు, దగ్గు కారణంగా లాలాపేట హాస్పిటల్‌కు వెళ్లగా.. కరోనా అనే అనుమానంతో గాంధీ హాస్పిటల్‌కి వెళ్లాలని సూచించారు. ఇలా ఆస్పత్రిల వెంట తిరుగుతూనే ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. 
 
గురువారం రాత్రంతా మృతదేహం రోడ్డుపైనే పడి ఉంది. శుక్రవారం తెల్లవారుజామున రోడ్డుపై అటుగా వెళ్తున్న వారు రోడ్డుపై ఓ వ్యక్తి పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం దగ్గర కింగ్ కోఠీ హాస్పిటల్ పత్రాలు ఉండటాన్ని గమనించిన పోలీసులు అతడు హాస్పిటల్‌కు వెళ్లినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.