గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (13:30 IST)

తస్మాత్ కరోనా వైరస్‌ జాగ్రత్త... కేంద్రం హెచ్చరిక

చైనా దేశాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోంది. ఈ వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో పక్కనే ఉన్న భారత్ కూడా అప్రమత్తమైంది. దేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఇప్పటివరకు 60 విమానాల్లో వచ్చిన 12,828 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించామని, అయితే ఎలాంటి పాజిటివ్ కేసు నమోదుకాలేదని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్ తెలిపారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తి, సన్నద్ధతపై ఆమె ఓ సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రయాణికులకు ఇప్పటికే ట్రావెల్ అడ్వైజరీని జారీచేసిన కేంద్రం.. విమానాశ్రయాల్లో సన్నద్ధతపై సమీక్ష నిర్వహించి పటిష్ట చర్యలు చేపట్టాలని తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు లేఖరాసినట్టు తెలిపింది. 
 
కాగా, సౌదీ అరేబియాలోని అల్ హయత్ దవాఖానలో పనిచేస్తున్న కేరళ నర్సుకు కరోనా వైరస్ సోకింది. సుమారు 100 మంది భారతీయ నర్సులకు (కేరళకు చెందినవారే అత్యధికులు) స్క్రీనింగ్ నిర్వహించగా, ఒక నర్సుకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. 
 
బాధిత నర్సుకు అసీర్ జాతీయ దవాఖానాలో చికిత్స అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. అయితే ఆ వైరస్ చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ కాదని, వేరే జాతికి చెందిన కరోనా వైరస్ అని జెడ్డాలోని భారత కాన్సులేట్ స్పష్టం చేసింది. అలాగే, ఆరోగ్య శాఖ చేపట్టిన ఏర్పాట్లపై కూడా ప్రధానమంత్రి కార్యాలయం కూడా సమీక్ష నిర్వహిస్తుంది.