కివీస్ జట్టుపై టీమిండియా విజయభేరి- 7వికెట్ల తేడాతో గెలుపు, 2-0తో ఆధిక్యం
కివీస్ జట్టుపై టీమిండియా విజయభేరి మోగించింది. దేశంలో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న తరుణంలో.. కివీస్ పర్యటనలో వున్న భారత జట్టు రెండో గెలుపు ద్వారా జాతీయ జెండాకు సెల్యూట్ చేసింది. విరాట్ కోహ్లీ సేన ఆద్యంతం మెరుగ్గా రాణించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అదరగొట్టారు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. దీంతో ఏడు వికెట్ల తేడాతో మ్యాచ్ సొంతం చేసుకుంది.
కివీస్ విసిరిన 133 పరుగుల లక్ష్యాన్ని మరో 2.3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. రోహిత్ (8), కోహ్లీ (11) త్వరగా పెవిలియన్ చేరినా.. లోకేశ్ (56 నాటౌట్), శ్రేయాశ్ అయ్యర్ (44) మ్యాచ్‌ను గెలిపించారు. శ్రేయాస్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన దూబే(8 నాటౌట్).. సిక్స్ కొట్టి మ్యాచ్ పూర్తి చేశాడు. కివీస్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు, సోదీ ఒక వికెట్ తీసుకున్నారు.
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఈ విజయంతో ఐదు టి20ల సిరీస్ లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. అక్లాండ్‌లోని ఇదే మైదానంలో జరిగిన తొలి టీ20లోనూ న్యూజిలాండ్ ఓడిపోయింది. భారత్ గెలుపును నమోదు చేసుకుంది.
భారత బౌలర్లలో జడేజా రెండు వికెట్లు, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, దూబే చెరో వికెట్ తీసుకున్నారు.ఇరు జట్ల మధ్య మూడో టి20 జనవరి 29న హామిల్టన్ లో ని సెడాన్ పార్క్ స్టేడియంలో జరగనుంది.