భార్యతో వీడియోకాల్‌లో మాట్లాడుతూ ఫ్యానుకు ఉరేసుకున్న భర్త...
ఇటీవలి కాలంలో భార్య వేధింపుల కారణంగా బలవన్మరణాలకు పాల్పడుతున్న భర్తల సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేవారిలో ఎక్కువ మంది విద్యావంతులు, ఉద్యోగులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, ఓ బ్యాంకు ఉద్యోగి.. తన భార్యతో వీడియోకాల్‌లో మాట్లాడుతూ ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాగ్‌హాట్ జిల్లా తెలిసిల్లాబర్రాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలిసిల్లాబర్రాకు చెందిన పంకజ్ బీసీన్(32) చిత్తూరు జిల్లా సోమల కార్పొరేషన్ బ్యాంకులో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఆర్నెల్ల క్రితం మధ్యప్రదేశ్‌కు చెందిన కిరణ్ కుమారితో వివాహం జరిగింది. ఆమె అక్కడే ప్రభుత్వ వైద్యశాలలో స్టాఫ్ నర్స్‌గా పని చేస్తోంది.
అయితే, ఇంతలో భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ, బుధవారం రాత్రి భార్యకు వీడియోకాల్ చేసి మాట్లాడిన పంకజ్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపాడు. ఆమె వెంటనే విషయాన్ని సోమలలోని పంకజ్ సహచర ఉద్యోగులకు ఫోన్ ద్వారా తెలిపింది.
వారు అక్కడికి చేరుకునేటప్పటికే పంకజ్ ఫ్యాన్‌కు ఉరేసుకోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టగా అప్పటికే పంకజ్ మృతి చెందాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదని ఎస్‌ఐ లక్ష్మీకాంత్ తెలిపారు.