శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 25 అక్టోబరు 2021 (10:08 IST)

బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సిపిఐ మద్దతు

బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో ప్రధాన ప్ర‌త్య‌ర్థులైన టీడీపీ, జ‌న‌సేన బ‌రి నుంచి త‌ప్పుకోగా ఇపుడు కాంగ్రెస్, బీజేపీ బ‌రిలో నిలిచాయి. దీనికి అనుగుణంగా రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు కూడా మారుతున్నాయి. బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సిపిఐ మద్దతు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు.
 
ఒక పక్క కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి అన్ని విషయాల్లో వైసిపి మద్దతు ఇస్తోంది. కానీ, ఇక్క‌డ బ‌ద్వేలు ఉప ఎన్నికల్లో మాత్రం వైసిపి, బిజెపిలు పరస్పరం పోటీలో ఉన్నాయి. వైసీపీ, బీజేపీల దోబూచులాటలకు ఇవే నిదర్శనాల‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా కంటక విధానాలను ఎండగట్టాల్సిన అవసరం ఉంద‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అనాలోచిత, నిరంకుశ విధానాలను తిప్పికొడ‌తామ‌ని ఆయ‌న చెప్పారు. 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసర వస్తువులు ధరలు, విద్యుత్ ఛార్జీలు తదితరాలు ఇబ్బడిముబ్బడిగా పెంచి ప్రజలపై గుదిబండ మోపాయ‌ని రామ‌కృష్ణ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య, లౌకిక వ్యవస్థను కాపాడటానికి బద్వేలు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గం నిర్ణయించింద‌ని చెప్పారు. బద్వేలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి తోడ్పడవలసిందిగా క్యాడ‌ర్ కు, ప్ర‌జ‌ల‌కు విజ్ఞప్తి చేస్తున్నామ‌ని  సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు.