విశాఖ ఉక్కు కోసం ఆగస్టు 2, 3న ఛలో ఢిల్లీ!
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలపై ఏపీకి అన్యాయం చేసేలా కేంద్ర మంత్రుల సమాధానాలున్నాయని, వారిది పూర్తిగా మొండి వైఖరి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అయినప్పటికీ, 2014 ఏప్రిల్ అంచనా వ్యయమే భరిస్తామని కేంద్ర మంత్రి షెకావత్ సమాధానమివ్వడం దుర్మార్గమన్నారు.
అలాగే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించి తీరుతామని కేంద్ర మంత్రులు పదేపదే మొండి వైఖరితో సమాధానం ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని రామకృష్ణ చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆగస్టు 2, 3 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు.
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 5న ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నామని చెప్పారు. దీనిపై ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు సమైక్యంగా పోరాడాల్సిన తరుణమిదని రామకృష్ణ వ్యాఖ్యానించారు.