శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 జులై 2021 (08:34 IST)

జాతీయ రాజకీయాల్లోకి మమతా : టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపిక

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చేందుకు తొలి అడుగు వేశారు. తృణమూల్ రాజ్యసభ, లోక్‌సభ ఎంపీలు ఆమెను పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. ఈ పరిణామంతో ఆమె ఇకపై జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించబోతున్నారన్న సంకేతాలు వెలువడ్డాయి. మమతా బెనర్జీ శనివారం ఢిల్లీ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటనకు ముందు ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
 
ప్రస్తుతం టీఎంసీకి లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. మమత ప్రస్తుతం పార్లమెంటు సభ్యురాలు కానప్పటికీ టీఎంసీ పీపీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికకు అర్హులేనని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈమె గతంలో ఏడుసార్లు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్నారు. 
 
పశ్చిమ బెంగాల్‌కు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆమెకున్న సుదీర్ఘ అనుభవాన్ని అసెంబ్లీతోపాటు, పార్లమెంటులోనూ వినియోగించుకోవాలని పార్టీ నిర్ణయించిందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ తెలిపారు. పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్‌గా ఆమె తమకు దిశానిర్దేశం చేస్తారన్నారు. 
 
మరోవైపు ఢిల్లీ పర్యటనకు వచ్చే మమతా బెనర్జీ వివిధ పార్టీల నేతలతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోనూ భేటీ అవుతారు. కాగా, కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలని మమత ప్రయత్నిస్తున్నారు. దేశ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించుకుని బీజేపీయేతర పక్షాలన్నీ ఉమ్మడి వేదికపైకి రావాలని మమత ఇటీవల పిలుపునిచ్చిన విషయం తెల్సిందే.