ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

అర్థరాత్రి ఐఏఎస్ అధికారిణి ఇంట్లో చొరబడిన డిప్యూటీ తాహశీల్దారు

arrested
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఓ మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లో డిప్యూటీ తాహశీల్దారు చొరబడిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై మహిళా ఐఏఎస్ అధికారిణి ఫిర్యాదు మేరకు డిప్యూటీ తాహశీల్దారుతోపాటు ఆయన స్నేహితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, జూబ్లీహిల్స్‍‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న మహిళా ఐఏఎస్ అధికారి ఒకరు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఆమె సోషల్ మీడియా ఖాతాను డిప్యూటీ తాహశీల్దారు ఒకరు క్రమంగా ఫాలోఅవుతుంటారు. పైగా, ఆమె చేసే ట్వీట్లకు ఆయన కామెంట్స్ చేయడం, రీ ట్వీట్ చేయడం వంటి జరుగుతున్నాయి. 
 
ఈ క్రమంలో 48 యేళ్ల వయస్సుండే డిప్యూటీ తాహశీల్దారు.. రెండు రోజుల క్రితం అర్థరాత్రి 11.30 గంటల సమయంలో తన స్నేహితుడైన ఓ హోటల్ యజమానిని తీసుకుని కారులో నేరుగా ఆమె నివాసం ఉండే గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ కాలనీకి వెళ్లారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బందికి తన వివరాలు చెప్పడంతో వారు లోనికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. 
 
దీంతో స్నేహితుడిని కారులో ఉంచిన డిప్యూటీ తాహశీల్దారు ఆమె ఇంటికి వెళ్లి నేరుగా తలుపు తట్టడంతో ఆమె వచ్చి తలుపు తెరిచింది. ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి కనిపించడంతో షాకయ్యారు. ఆ తర్వాత తేరుకుని మీరు ఎవరు, ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. 
 
దీనికి డిప్యూటీ తాహశీల్దారు గతంలో మీకు ట్వీట్ చేశానని, ఉద్యోగం గురించి మాట్లాడేందుకు వచ్చానని చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేసి ఆమె తక్షణ ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కేకలు వేశారు. ఆ వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అలాగే అతని స్నేహితుడుని కూడా అరెస్టుచేశారు. కారును జప్తు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.