శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 ఆగస్టు 2019 (13:24 IST)

పేదోడి కడుపులో తన్నిన సీఎం జగన్ : దేవినేని ఉమ

రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను మూసివేసి కోటి ఇరవై లక్షల మంది పేదోళ్ళ నోటికాడి కూడును లాగేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. శుక్రవారం చంద్రాబాబు పిలుపుమేరకు మైలవరం నియోజకవర్గంలో జక్కంపూడి, కొండపల్లి, జి.కొండూరు, మైలవరం అన్న క్యాంటీన్ల వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలు చేశారు. 
 
జక్కంపూడి ధర్నాలో పాల్గొన్న దేవినేని ఉమా ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు హయాంలో కోటి ఇరవై లక్షల మంది పేదలు అన్న క్యాంటీన్ల ద్వారా కడుపునింపుకున్నారని, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం వారి కడుపులపై తన్నిందని విమర్శించారు. అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల అన్నంగిన్నెను తన్నేసినట్లు చెప్పారు. క్యాంటీన్ల ఎత్తివేత అన్యాయమంటే మైలవరంలో 17మందిపై అక్రమ కేసులు పెట్టినట్లు ఆరోపించారు. 
 
ఇసుక ధరలను పెంచి 2 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డుకీడ్చారని పేర్కొన్నారు. రూ.500 రూపాల ట్రాక్టర్ ఇసుక రేటును రూ.4 వేలు చేసారని, సిమెంట్ బస్తా కంటే ఇసుక బస్తా రేటే ఎక్కువగా ఉందన్నారు. ప్రతిరోజు ధర్నాచౌక్ దగ్గర ప్రజా సమస్యలపై ప్రజలు ధర్నాలు చేస్తున్నారని, అయినా వారి మొర ఆకలించే నాథుడు లేరన్నారు. 
 
ఒక పక్క రాష్ట్రంలో వరదలొస్తుంటే ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా అమెరికా వెళ్లారని అంటూ, రాష్ట్రంలో ఏ వాగులు, వొంకలు పొంగకపోయినా గ్రామాలను నీట మునిగేలా చేసినట్లు ఆరోపించారు. చంద్రబాబు ఇంటికి వరదనీరు పంపేందుకే ఎగువ నుండి వస్తున్న వరద జలాలను నాలుగురోజుల పాటు నిల్వబెట్టారని ఆరోపించారు. 
 
రాజధాని అమరావతిని ఇడుపులపాయకు తరలించే కుట్రలు జరుగుతున్నాయని, 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తారా? దేవినేని ఉమా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దేశం శ్రేణులు, మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసారు.