మంగళవారం, 22 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 12 జులై 2015 (08:35 IST)

వైకాపాలో చేరుతున్నట్టు ఎవరు చెప్పారు: డొక్కా మాణిక్యవరప్రసాద్

తాను కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నట్టు ఎవరు చెప్పారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రశ్నించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... వైఎస్సార్సీపీలో చేరే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనకు ఓ గుర్తింపు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, అందువల్ల తాను ఆ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 
 
వాస్తవానికి ఆయన గత యేడాది ఆగస్టులో టీడీపీలో చేరేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. కానీ, స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో తన ప్రయత్నాలను విరమించుకున్నారు. దీంతో వైఎస్సార్సీపీలో చేరనున్నట్టు ఆయన సన్నిహితులు చెపుతూ వచ్చారు. ఇందుకోసం ఈనెల 13వ తేదీని ముహుర్తంగా నిర్ణయించుకున్నారన్న వార్తలపై డొక్కా పైవిధంగా స్పందించారు. 
 
మరోవైపు నర్సాపురం ఎంపీ రాయపాటి సాంబశివరావుకు డొక్కా శిష్యుడు. తన శిష్యుడి పార్టీ మార్పుపై రాయపాటి స్పందిస్తూ.. 'డొక్కా మాకు సోదరుడులాంటి వాడు. ఆయన వైఎస్సార్సీపీలో చేరడు' అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు.. డొక్కాను టీడీపీ గూటికి చేర్చేందుకు రాయపాటి తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.