మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 27 మే 2019 (14:53 IST)

భార్యపై అనుమానం.. గడ్డపారతో అతి దారుణంగా చంపిన భర్త...

అనుమానం పెనుభూతమైంది. అగ్నిసాక్షిగా పెళ్ళి చేసుకున్న భర్త అతి దారుణంగా భార్యను కడతేర్చాడు. చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో సంఘటన జరిగింది. అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తల మధ్య గొడవ జరిగి భార్య విగతజీవిగా మారిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. కుటుంబం మొత్తం శోక సంద్రంలోకి వెళ్లిపోయింది.
 
వి.కోట మండలం దాసార్లమండలంకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనివాసులకి, వసంతలకు పది సంవత్సరాల క్రితం వివాహమైంది. మొదట్లో వీరి జీవితం సాఫీగానే సాగిపోయేది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే గత సంవత్సరం నుంచి భార్య వసంతపై భర్త అనుమానం పెట్టుకున్నాడు. తన భార్య వేరొకరితో కలిసి ఉంటోందన్న అనుమానం శ్రీనివాసులలో మొదలైంది.
 
భార్యతో ఇదే విషయమై ఎన్నోసార్లు గొడవకు దిగాడు. అయితే వసంత మాత్రం తను ఎవరితోను కలిసి ఉండలేదని, నమ్మండని చెబుతూ వచ్చింది. అయితే రెండురోజుల క్రితం ఇద్దరి మధ్యా వాగ్వాదం ఎక్కువైంది. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాసులు ఇంటిలోని గడ్డపారతో వసంతను అతి దారుణంగా హత్య చేశాడు. వి.కోట పోలీస్టేషనుకు వెళ్ళి లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.