శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (22:29 IST)

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 25 శాతం వెయిటేజీ తొలగింపు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈఏపీసెట్ ఇంటర్ మార్కుల వెయిటేజీని తొలగించారు. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా ప్రవేశాలకు (ఈఏపీసెట్‌) ఇంటర్‌ మార్కుల వెయిటేజ్ తొలగించింది. ఇప్పటివరకు ఇంటర్‌ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీని తొలగించింది. 
 
ఈ ఏడాది ఈఏపీసెట్‌ 100శాతం రాత పరీక్ష మార్కుల ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయని ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ వెల్లడించారు. కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలు రద్దు చేసినందున ఈ ఒక్క ఏడాదికే ఇంటర్‌ మార్కుల వెయిటేజీ తొలగింపు అమలు చేయనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు.
 
ఏపీ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌)-21ను ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 
 
ఈఏపీసెట్‌ను గతంలో ఎంసెట్‌గా పిలిచేవారు. వైద్యవిద్యలో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో ప్రత్యేక పరీక్ష (నీట్‌) నిర్వహిస్తున్నందున ఎంసెట్‌లో ‘ఎం’ అనే అక్షరాన్ని తొలగించారు. ఫార్మసీ ప్రవేశాలను ఈ ప్రవేశ పరీక్ష ద్వారా నిర్వహిస్తున్నందున ‘ఎం’ స్థానంలో ‘పి’ ని చేర్చి ఈఏపీసెట్‌గా మార్పు చేశారు.