సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 1 ఆగస్టు 2021 (08:56 IST)

వశిష్ట నదిలో దూకిన దంపతులు - పిల్లలు సహా

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఓ విషాదకర సంఘటన జరిగింది. ఓ దంపతుల జంట తమ పిల్లలతో కలిసి వశిష్ట నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ దారుణం జిల్లాలోని మామిడికుదరు మండలం మొగలికుదురులో జరిగింది. 
 
బైక్‌పై చంచినాడ బ్రిడ్జి వద్దకు చేరుకున్న దంపతులు దానిపై నుంచి పిల్లలతో సహా వశిష్ఠ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్నవెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్రిడ్జిపై ఉన్న బైక్, చిన్నారుల దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. 
 
కుటుంబంలో తలెత్తిన మనస్పర్థలే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే, కొందరు వ్యక్తులు తమను దారుణంగా మోసం చేశారని, వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు భార్య పేరుతో ఉన్న లేఖ, ఆడియో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.