శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 9 మార్చి 2020 (16:10 IST)

ఎన్నికల పరిశీలకులు వెంటనే జిల్లాలకు వెళ్లాలి: ఎన్నికల కమిషన్

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించడంలో ఎన్నికల పరిశీలకులు కీలకమైన పాత్ర పోషించాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ స్పష్టం చేశారు. 
 
సోమవారం ఉదయం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో 13 జిల్లాలకు నియమించిన ఎన్నికల పరిశీలకులతో ప్రత్యేక సమావేశం ఆయన నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఎన్. రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల పరిశీలకులు గా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపున జిల్లాలలో విధులు నిర్వహించే బాధ్యత మీపై ఉందన్నారు.

ఎటువంటి అభద్రతా భావానికి లోను కావాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే నేరుగా సంప్రదించండని, 24 x 7 మీకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, స్వీకరించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాట్సప్ గ్రూప్ ద్వారా  అందుబాటులో ఉండడం జరుగుతుందని తెలియచేశారు.
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లు సేవలు వినియోగించవద్దని రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల పరిశీలకులు గా ఎటువంటి ఘటనలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఓటర్ల ను ప్రభావితం చేసే ప్రభుత్వ పధకాలను ప్రకటించడం పై నిషేధం అమలులో ఉందన్నారు. ఓటర్ల ను  ప్రభావితం, ప్రలోభాలకు గురి చేసే  ఏ పథకమైనా నిలుపుదల చెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు. 

ప్రజలకు జిల్లా ఎన్నికల పరిశీలకులు అందుబాటులో ఉండాలని, వారి  ఫోన్ నెంబర్, చిరునామా మీడియా ద్వారా తెలియచెయ్యలన్నారు. ఎటువంటి ఆరోపణలను తావు లేకుండా నిర్భయంగా విధులను నిర్వర్తించాల్సి ఉందన్నారు.

స్థానిక సంస్థలకు ఎన్నికల ను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నందున, బ్యాలెట్ పేపర్ ల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులు నేరుగా జిల్లాలకు వెళ్లి విధుల్లోకి వెంటనే చేరాలని తెలియచేశారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ కార్యదర్శి ఏస్.రామసుందర రెడ్డి, జాయింట్ సెక్రటరీ ఎ వి సత్య రమేష్, ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు.
 
13 జిల్లాల పరిశీలకులుగా సీనియర్ ఐఏఎస్ లు
 
కె. ఆర్.బి. హెచ్. ఎన్. చక్రవర్తి - కర్నూలు,  
ఎం. పద్మ - కృష్ణ జిల్లా , 
పి.ఉషా కుమారి - తూర్పు గోదావరి జిల్లా,   
పి.ఎ.  శోభా - విజయనగరం జిల్లా, 
కె. హర్షవర్ధన్ - అనంతపురం జిల్లా, 
టి. బాబు రావు నాయుడు -  చిత్తూరు జిల్లా,  
ఎం. రామారావు -  శ్రీకాకుళం జిల్లా,  
కె. శారదా దేవి - ప్రకాశం జిల్లా ,
ప్రవీణ్ కుమార్ - విశాఖపట్నం జిల్లా,  
బి. రామారావు -ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా
పి. రంజిత్ బాషా - వైయస్ఆర్ కడప జిల్లా,   
కాంతిలాల్ దండే - గుంటూరు జిల్లా, 
హిమాన్షు శుక్లా -  పశ్చిమ గోదావరి జిల్లా
 
వీరికి అదనంగా ఉన్న నలుగురు సీనియర్ ఉన్నతాధికారులను  సిహెచ్.  శ్రీధర్, జి. రేఖ రాణి, టి.కె.రామమణి, ఎన్.ప్రభాకర్ రెడ్డి లను రిజర్వు లో ఉంచింది.