మహోద్యమంగా ఇంధన పొదుపు... విజయవాడలో ర్యాలీ
దేశాన్నే కాదు... ప్రపంచాన్నే ఇపుడు శాసిస్తోన్నది ఇంధనం. పెట్రోలు, డీసిల్ రేట్లు పెరిగిపోవడంతోపాటు, విద్యుత్ వినియోగం కూడా పెరగడంతో ఆకాశాన్ని అంటుతున్న ఇంధన రేట్లను తగ్గించాలంటే, పొదుపు చాలా ముఖ్యమని గుర్తించారు. డిసెంబర్ 14 నుంచి 20 వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు పాటిస్తున్నారు.
ఇంధన పొదుపుపై నగర వాసుల్లో అవగాహన కల్పించేందుకు విజయవాడలో ఇంధన పొదుపు ర్యాలీని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, జిల్లా కలెక్టర్ జె.నివాస్ ప్రారంభించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం వరకు ఇంధన పొదుపుపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో వియంసి కమిషనర్ వి. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ కె.మోహన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల ఇంధన అదాకు ప్రణాళిక వేశామని, మహోద్యమంగా విద్యుత్ పొదుపు ను తీర్చిదిద్దుతామని ఇంధనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ తెలిపారు. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇంధన పొదుపు అత్యావశ్యకమన్నారు. ఇంధన పొదుపు పై అవగాహన కలిగించే పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేసిన ఇంధన శాఖ కార్యదర్శి ఎన్. శ్రీకాంత్, కలెక్టర్ జె.నివాస్ విడుదల చేశారు.