శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 8 జులై 2021 (09:08 IST)

తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు - మరో 4 నెలల్లో సేవలు

తిరుమల, తిరుపతిలో మరో నాలుగు నెలల్లో ఎలక్ట్రిక్ బస్సులు సేవలు అందించనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడిపేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తిరుమల ఘాట్, తిరుపతిలో 100 బస్సులతోపాటు విశాఖలో 100, విజయవాడ, గుంటూరు, కాకినాడలలో 50 చొప్పున మొత్తం 350 ఎలక్ట్రిక్ బస్సులకు ఐదు లాట్లుగా ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 
 
ఇందులో తిరుపతి అర్బన్, తిరుమల ఘాట్‌లో బస్సులు నడిపేందుకు ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఒలెక్ట్రా) ఎల్-1గా నిలిచింది. ఆర్టీసీ డీజిల్ ఏసీ బస్సులకు ప్రతి కిలోమీటర్‌కు అయ్యే ఖర్చుకే ఈ సంస్థ బస్సులు నడపనుంది. విద్యుత్ చార్జితో కలిపి తిరుమల ఘాట్‌లో కిలోమీటరకు రూ. 52.52, తిరుపతి అర్బన్‌లో 44.95 చొప్పున ప్రభుత్వం అద్దె చెల్లించనుంది.
 
ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో ఫేమ్-2 కింద వీటికి సాయం అందించాలని కేంద్రానికి ఆర్టీసీ అధికారులు నిన్న సమాచారం పంపారు. 
 
కాగా, విశాఖపట్టణం, గుంటూరు బస్సు టెండర్లలో ఈవీ ట్రాన్స్ (ఒలెక్ట్రా), విజయవాడ, కాకినాడల్లో అశోక్ లేలాండ్ ఎల్-1గా నిలిచాయి. అయితే, ఇవి ఎక్కువగా కోట్ చేయడంతో ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. దీంతో ఈ టెండర్లు కథ ముగిసినట్టేనని అధికారులు పేర్కొన్నారు.