మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: విజయవాడ , గురువారం, 2 సెప్టెంబరు 2021 (12:56 IST)

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు!

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌, ఆయన సతీమణి టీఎన్‌ విజయలక్ష్మిపై ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని  సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. పబ్లిక్‌ సర్వెంట్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 
 
మంత్రి సురేశ్‌ ఆయన సతీమణి విజయలక్ష్మి ఇద్దరూ ఐఆర్‌ఎస్‌ అధికారులు. సురేశ్‌ రాజకీయాల్లోకి వచ్చారు.  ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో సీబీఐ అధికారులు 2016లో దేశవ్యాప్తంగా పలువురు ఐఆర్‌ఎస్‌ అధికారుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ క్రమంలో  విజయలక్ష్మిపై కేసు నమోదు చేసి, 2017లో ఎఫ్‌ఐఆర్‌ కట్టారు. దీనిలో విజయలక్ష్మిని ప్రధాన నిందితురాలిగా, సురేశ్‌ను రెండో నిందితునిగా పేర్కొన్నారు. అయితే తమపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు సీబీఐ ఎలాంటి ప్రాథమిక విచారణ జరపలేదని, దీనిని కొట్టి వేయాలని కోరుతూ. సురేశ్‌ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లలితకుమారి ప్రాథమిక విచారణ చేపట్టకుండానే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారని పేర్కొంటూ, ఫిబ్రవరి 11న దీనిని తోసిపుచ్చింది.

ఈ తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై జరిగిన విచారణలో సీబీఐ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. అన్ని ఆధారాలతోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఆయా విషయాలను అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. మరోసారి ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది.