ఒకవైపు ఆర్ధిక సంక్షోభం అంటూనే దుబారా ఖర్చులు పెడుతున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అవసరం లేకుండా ప్రతి దానికి సలహాదారుని నియమించుకొని లక్షల వేతనాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు.
రాజధాని పనులు నిలిపివేత, సంక్షేమ పథకాల రద్దు జిల్లాలో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, మీడియాపై ఆంక్షలు తదితర అంశాలపై సభలో సమగ్రమైన చర్చ జరిగేలా చూడాలని నిర్దేశించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లి సమావేశాల్లో గళమెత్తి ప్రభుత్వాన్ని నిలదీసి, వైఫల్యాలను ఎండగట్టాలని తన పార్టీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం మంగళగిరిలో నూతనంగా ప్రారంభించిన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తొలి టీడీఎల్పీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత రెండు అసెంబ్లి సమావేశాలు మొక్కుబడిగా నిర్వహించారని ఇప్పుడు కూడా అదే తరహాలో ముగించాలని అధికారపక్షం చూడడం సరికాదన్నారు. ఎన్ని రోజులు అయినా సమావేశాలు నిర్వహిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్, ఇప్పుడు ఈ విధంగా మొక్కుబడి సమావేశాలు చేపట్టడం ఆయన డొల్లాతనాన్ని బయటపెడుతోందని వ్యాఖ్యానించారు.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఆరు నెలల వ్యవధి అవసరమని అప్పటి వరకు సైలెంట్‌గా వ్యవహరిద్దామని భావించామని, అయితే పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచే అధికారపక్షం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందుల పాలు చేసిందని, వీటన్నింటినీ అసెంబ్లిdలో వినిపించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్దేశించారు. సభ్యులంతా సమగ్రమైన సమాచారాన్ని తెప్పించుకొని అధ్యయనం చేయాలని సూచించారు.
ముఖ్యంగా ఉల్లి, నిత్యావసరాల ధరలు, బీసీలపై కక్ష సాధింపు చర్యలు, టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు, నదుల అనుసంధానం విభజన చట్టంలో అంశాల అమలు, ఇసుక కొరతతో ఆత్మహత్యలకు పాల్పడ్డ వారి కుటుంబాలకు న్యాయం, రైతులకు గిట్టుబాటు ధర తదితర అంశాలను లేవనెత్తాలని దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా రైతు రుణమాఫీ 4,5 కిస్తీలు ప్రభుత్వం నిలిపివేసిందని, ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు.
గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు వాలంటీర్ల నియామకాల్లో అక్రమాలు వెలుగులోకి తేవాలని చెప్పారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు, నరేగా బిల్లుల పెండింగ్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు, గృహ నిర్మాణ పథకాల నిలుపుదల తదితర అంశాలను లేవనెత్తాలని సూచించారు. మరోవైపు బిల్డ్ ఏపీ పేరిట ప్రభుత్వ భూముల అమ్మకాలను నిలదీయాలని ఇదే విధంగా వ్యవహరిస్తే రాష్ట్రం అంధకారంగా మారుతుందని చంద్రబాబు అన్నారు.
ఈ సందర్భంగా పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్‌లో శనగ నిల్వలు పెట్టుకున్న రైతులు 30 వేల మంది ఉన్నారని వారందరికి ప్రభుత్వం మినిమం సపోర్టు ప్రైస్ కింద ఒక్కొక్కరికి రూ.45 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.6 వేలు మాత్రమే చెల్లించిందని వివరించారు.
ఇదే సందర్భంగా ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయడం లేదని అంతేకాకుండా గతంలో మంజూరు చేసిన రూ.250 కోట్ల పనులను రద్దు చేసి నియోజకవర్గానికి రూ.కోటి ఇస్తామని వైకాపా గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. కొండెపి ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ గతంలో ఇచ్చిన ఇళ్ళ స్థలాలను రద్దు చేస్తున్నారని అంతేకాకుండా మూడు సెంట్ల స్థలాన్ని రెండు ముక్కలుగా విభజించి కేటాయిస్తున్నారని తెలిపారు.
బీసీలను మంత్రి కొడాలి నాని బ్రోకర్‌లు అంటూ వ్యాఖ్యానించడం ఈ సమావేశంలో నేతలు తప్పుపట్టి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి యనమలను దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. బీసీలపై కక్ష సాధింపు చర్యలకు వైకాపా పాల్పడుతుందని ముఖ్యమంత్రి జగన్‌కు ఈ సామాజిక వర్గాలపై ఉన్న అభిప్రాయాన్ని మంత్రి కొడాలి నాని ద్వారా బయటకు చెప్పిస్తున్నారని వ్యాఖ్యానించారు.
నేతల అభిప్రాయాలపై స్పందించి చంద్రబాబు పాదయాత్రలో జగన్ అనేక హామీలు ఇచ్చుకుంటూ పోయారని అవి నెరవేర్చలేక ఇప్పుడు ఒక్కొక్కదాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారని అన్నారు. మహిళలకు 45 ఏళ్ళకే పింఛన్ ఇస్తామని ఆ తర్వాత ఫ్లేట్ ఫిరాయించారని విమర్శించారు. రైతు భరోసాకు రూ.12,500 ఇస్తామని ప్రకటించి ఇప్పుడు మూడు విడతలుగా మార్చారని దుయ్యబట్టారు.
సామాజిక భద్రత ఫించన్లను రూ.వెయ్యి పెంచుతామని చెప్పి దానిని రూ.250కే పరిమితం చేశారని ధ్వజమెత్తారు. మరోవైపు రైతులకు పంట బీమా ప్రభుత్వమే కడుతుందని హామీలు గుప్పించారని వారు ఇచ్చిన హామీ మేరకు రూ.వెయ్యి కోట్లు చెల్లించాల్సి ఉండగా దానిలో 20 శాతం కూడా కట్టిన పాపాన పోలేదన్నారు. సున్నా వడ్డీ పేరుతో రైతులను దగా చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
బడ్జెట్‌లో రూ.180 కోట్లు కేటాయించి దానిలో 10వ వంతు విడుదల చేయడం శోచనీయమన్నారు. ఇదిలా ఉంటే పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఇది జగన్మాయ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో తమ హయాంలో చేసిన అభివృద్ధికి సంబంధించిన ఫోటోలను పెట్టుకొని తామే చేసినట్లు చెప్పుకోవడం వైకాపా దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.
కంటి వెలుగు పథకాన్ని తీసుకువచ్చింది తెదేపానేనని అయితే దానికి వైఎస్సార్ పేరు తగిలించి ఈ పథకాన్ని తామే పెట్టినట్లు కనికట్టు చేస్తున్నారని అన్నారు. మరోవైపు అనంతపురంలో కియాను తీసుకువచ్చింది ఎవరో ప్రపంచమంతా తెలుసని అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ 18 వేల ఉద్యోగాలు తానే తెచ్చానని చెప్పుకోవడం దౌర్భాగ్యమని చంద్రబాబు మండిపడ్డారు.
కార్యకర్తలకు అండగా నిలుద్దాం ..
పార్టీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు, బాధల్లో ఉన్నారని వారికి నేతలంతా అండగా ఉండాలని టిడిపి అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో నాలుగుసార్లు పార్టీ ఓటమి పాలు అయిన కార్యకర్తల్లోని నైతిక స్థైర్యం దెబ్బతినలేదని ఓటమి నుంచి తేరుకొని మరింత ఉత్సాహంతో పనిచేశారని చెప్పుకొచ్చారు. తప్పుడు కేసులు కార్యకర్తలపై పెడుతున్నారని నేతలు వారికి అండగా నిలిచి మనోధైర్యాన్ని కల్పించి అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పారు.
ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు, శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, టిడిఎల్పీ ఉపనేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, ఎమ్మెల్యేలు చినరాజప్ప, మద్దాలి గిరిధర్, గద్దె రామ్మెహన్, అనగాని సత్యప్రసాద్, కరణం బలరాం, ఎమ్మెల్సీలు నారా లోకేష్, గౌరువాని శ్రీనివాసులు, బచ్చుల అర్జునుడు, మంతెన సత్యనారాయణరాజు, టిడి జనార్ధన్‌తో పాటు ముఖ్యనేతలు పాల్గొన్నారు.