సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 24 ఆగస్టు 2019 (18:26 IST)

ప్రియుడితో కలిసి భర్తకు స్కెచ్ వేసిన భార్య... పూటుగా మద్యం సేవించి..

అన్యోన్య దాంపత్యం వారిది. ఇద్దరు కొడుకులు. అయితే భార్య వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని పండంటి కాపురంలో చిచ్చు రేపేలా చేసుకుంది. చివరకు ఆ సంబంధానికి తన భర్త అడ్డొస్తున్నాడని ఏకంగా అతన్నే చంపేందుకు ప్లాన్ కూడా చేసింది. 
 
చిత్తూరు జిల్లా పలమనేరు బైరెడ్డిపల్లికి చెందిన క్రిష్ణయ్యకు, అదే ప్రాంతానికి చెందిన మరో మహిళకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత ఐదు సంవత్సరాల వరకు వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే ఒక సంవత్సరం నుంచి తన ఇంటికి పక్కనే ఉన్న నాగరాజు అనే యువకుడితో ఆ వివాహిత వివాహేతర సంబంధం పెట్టుకుంది.
 
భర్త ఎన్నోసార్లు మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు సరికదా ఏకంగా తన భర్తనే చంపేయాలనుకుని ప్లాన్ చేసింది. ప్రియుడితో కలిసి ఒక స్కెచ్ వేసింది. నాగరాజు 30 వేలకు ఐదుమంది కిరాయి హంతకులను మాట్లాడుకున్నాడు. దాంతో శుక్రవారం మధ్యాహ్నం నాగరాజుతో పాటు ఐదుగురు కిరాయి హంతకులు పూటుగా మద్యం సేవించారు.
 
ఒంటరిగా వెళుతున్న క్రిష్ణయ్యపై దాడి చేశారు. కత్తులతో ఒక్కొక్కరు ఒక్కోసారి పొడిచారు. క్రిష్ణయ్య చనిపోయాడనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే క్రిష్ణయ్య చనిపోలేదు. చావుబతుకుల మధ్య ఉంటే అటుగా వెళుతున్న వారు గుర్తించి వెంటనే అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. క్రిష్ణయ్య ఫిర్యాదుతో అతని భార్యతో పాటు ప్రియుడు, ఐదుగురు కిరాయి హంతకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.