సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ప్రీతి
Last Updated : మంగళవారం, 20 ఆగస్టు 2019 (20:04 IST)

ఐదు దశాబ్దాల క్రితం మాయమైన విమానం ఆచూకీ లభ్యం

దాదాపు 5 దశాబ్దాల క్రితం అదృశ్యమైన విమానం మంచులో కూరుకుపోయిన అరుదైన ఘటన హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం, లాహౌల్ స్పితి జిల్లాలోని ఢాకా గ్లేసియర్ ప్రాంతంలో తాజాగా వెలుగుచూసింది. 1968వ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన భారత వాయుసేనకు చెందిన ఏఎన్-12 బీఎల్-534 విమానం 98 మంది సైనికులతో వెళుతూ రోహ్‌తంగ్ పాస్ వద్ద అదృశ్యమైంది. 51 ఏళ్ల క్రితం అదృశ్యమైన విమానం శకలాలైన ఎయిర్ ఇంజన్, ఎలక్ట్రిక్ సర్య్యూట్, ప్రొపెల్లర్, ఇంధన ట్యాంకు యూనిట్, ఎయిర్ బ్రేక్, కాక్‌పిట్ డోర్ మంచులో కూరుకుపోయి కనిపించాయి.
 
ఆనాడు గల్లంతైన భారత వాయుసేన విమానంలో 98 మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉండగా, 2003లో హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ సభ్యులు సిపాయి బేలిరాం మృతదేహాన్ని గుర్తించారు. 2007 ఆగస్ట్ 9వ తేదీన సైనికుల పర్వతారోహణలో మరో ముగ్గురు సిపాయిల మృతదేహాలు లభించాయి. ఈ ఏడాది జులై 1వ తేదీన విమానంలో వెళ్లి అదృశ్యమైన మరో సైనికుడి మృతదేహం దొరికింది. 
 
ఈ ఏడాది డోగ్రా స్కౌట్సు 13 రోజుల పాటు సోదాలు జరిపితే ఢాకా గ్లేసియర్ వద్ద విమాన శకలాలు కనిపించాయి. 98 మంది సైనికులతో వెళుతున్న భారత వాయుసేన విమానం వాతావరణం సరిగా లేనందున తిరిగి రావాలని గ్రౌండ్ కంట్రోల్ నుంచి సమాచారం అందించినా, రోహ్‌తంగ్ పాస్ వద్ద విమానం అదృశ్యమైంది. 51 ఏళ్ల క్రితం ప్రమాదానికి గురై మంచులో కూరుకుపోయిన విమాన శకలాలు నేడు వెలుగుచూశాయి.