సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, ఎందుకో తెలుసా? (video)
వైసిపి ప్రభుత్వ హయాంలో ఏపీఎఫ్ టివీడిసి చైర్మన్ గా పనిచేసిన పోసాని కృష్ణమురళిని ఏపీ లోని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేసారు. హైదరాబాదులోని రాయదుర్గం మైహోం భుజా అపార్టుమెంట్సులో వుంటున్న ఆయనను అదుపులోకి తీసుకున్నారు. రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చి అనంతరం ఆయనను రాయచోటికి తరలిస్తున్నారు.
పోసానిపై అన్నమయ్య జిల్లా పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసిన మేరకు ఆయనను అరెస్ట్ చేసారు. సినీ పరిశ్రమ పరువు తీస్తూ విమర్శలు చేసారంటూ ఆయనపై స్థానికులు ఫిర్యాదు చేసారు. ఈ మేరకు బుధవారం రాత్రి పోసానిని రాయచోటి పోలీసులు అరెస్ట్ చేసారు. గురువారం ఉదయం పోసాని కృష్ణమురళిని కోర్టులో హాజరు పరిచే అవకాశం వుంది.
గతంలో తెదేపా, జనసేన నాయకులను ఏకవచనంతో సంబోధించడమే కాకుండా దుర్భాషలాడారు పోసాని. చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఆ తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక ఒకింత వెనకడుకు వేసారు పోసాని. తను జీవితంలో రాజకీయాలు మాట్లాడననీ, తను ఏ పార్టీలోనూ చేరబోనని కూడా ప్రకటించారు. ఐతే ఇప్పటికే ఆయనపై ఏపీలోని పలు జిల్లాల్లో కేసులు నమోదు కావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసారు.