శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2024 (08:58 IST)

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

ramgopal varma
వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్టుకు ఏపీ పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వర్మ పారిపోయారు. ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేశారు. పోలీసులు అరెస్టు చేశాక.. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారన్న భయంతో ఆయన వణికిపోతున్నారు. 
 
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లపై అసభ్యకర పోస్టులు, ఫోటోల మార్ఫింగ్ చేసినందుకు ఆయనపై కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే. ఈ కేసుల్లో విచారణకు రావాలంటూ వర్మకు ఒంగోలు పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ విచారణలో భాగంగా, సోమవారం ఆయన ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్‌కు హాజరుకావాల్సివుంది. 
 
అయితే, విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ప్రకాశం జిల్లా పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి వర్మను అరెస్టు చేసేందుకు హైదరాబాద్ నగరంలోని ఫిల్మ్‌ నగరులో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, అప్పటికే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వర్మ తరపు న్యాయవాది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 
 
ఆర్జీవీ ఇంట్లో లేరని చెప్పారు. రెండోసారి నోటీసులు ఇచ్చినప్పుడే విచారణకు మరింత సమయం కావాలని తాము కోరామని, అయినప్పటికీ ఆరెస్టు చేసేందుకు ఎందుకు వచ్చారని నిలదీశారు. వర్చువల్‌గా విచా రించేందుకు అవకాశం ఉందని, ఆ మాధ్యమంలో ప్రశ్నిస్తే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 
 
కాగా, ఇదే విషయాన్ని వర్మ కూడా వాట్సాప్ ద్వారా పోలీసులకు తెలిపారు. వర్చువల్ విచారణకు అనుమతి ఇవ్వాలని విచారణాధికారిని కోరారు. దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంతలో పోలీసులకు మరో సమాచారం అందింది. వర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్టు తెలిసింది. ఆదివారం తన 'ఎక్స్' ఖాతాలో తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్టు వర్మ ఫొటోలు పోస్టు చేయడం దీనికి బలాన్నిచ్చింది. దీంతో ఆ దిశగా పోలీసులు దృష్టిసారించి, తమిళనాడు పోలీసులతో మాట్లాడారు. ఈ క్రమంలో మరో పోలీసు బృందాన్ని చెన్నైకి పంపేందుకు సిద్ధమవుతున్నారు.