ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి జీబీఎస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లాలో కొమరవోలులో మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) బారినపడి ప్రాణాలు కోల్పోయింది.
రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరంలో పాటు కాళ్లు చచ్చబడిపోవడంతో ఆమెను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ కన్నుమూసింది. జీబీఎస్ సిండ్రోమ్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన తొలి కేసుగా నమోదు చేశారు.
కాగా, ఈ నెల 3వ తేదీన గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి కమలమ్మను తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేసి జీబీఎస్ వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించి, అందుకు తగిన విధంగా చికిత్స అందించారు. దీంతో జ్వరం తగ్గినట్టు కనిపించడంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ ఆమెకు రెండు రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.