అక్కంపల్లి రిజర్వాయర్ వద్ద బర్డ్ ఫ్లూ కేసులు - భయం గుప్పెట్లో భాగ్యనగరి వాసులు
తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విజృంభించింది. దీంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విపరీతంగా కోళ్లు చనిపోతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాలోని అక్కంపల్లి రిజర్వాయర్‌లో వందల సంఖ్యలో చనిపోయిన కొళ్లు కొట్టుకుని వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ కోళ్లను ఈ రిజర్వాయర్‌లో పడేసినట్టు సాచారం. హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు ఈ రిజర్వాయర్ నుంచే తాగునీటిని సరఫరా చేస్తుంటారు. దీంతో ఆ ప్రాంత వాసులు బర్డ్ ఫ్లూ భయంతో వణికిపోతున్నారు.
ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే జిల్లా కలెక్టర్ దీనిపై విచారణకు ఆదేశించారు. నల్గొండ ఎస్పీ శరత్ చంద్రా దర్యాప్తును చేపట్టారు. దేవరకొండ ఆర్డీవో, నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్‌ను పరిశీలించారు. బర్డ్ ఫ్లూ కేసులు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత భయాందోళనకు గురిచేస్తుంది. రిజర్వాయర్‌లో చచ్చిన కోళ్లను పడేసిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీటి శాంపిల్స్ సేకరించిన అధికారులు వాటిని పరీక్షలకు పంపించారు.