పెళ్లి మండపంలో అనుకోని అతిథిలా చిరుతపులి ... బెంబేలెత్తిపోయిన చుట్టాలు (Video)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ పెళ్లి మండపంలో అనుకోని అతిథిలా ఓ చిరుతపులి కనిపించింది. దాన్ని చూసిన అతిథులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణభయంతో పెళ్లిమండపం నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అటవీ, పశువైద్య, అగ్నిమాపక సిబ్బంది 200 నిమిషాల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి చిరుతపులిని బంధించారు. అయితే,ఆ చిరుతపులి దాడిలో అటవీశాఖ అధికారి గాయపడ్డాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఈ ఘటన జరిగింది.
లక్నోలోని ఓ కళ్యాణ మండపంలో పెళ్లి వేడుక జరుగుతుంది. అయితే, ఆ ప్రాంగణంలో ఓ చిరుత పులి తీరిగ్గా విశ్రాంతి తీసుకోవడాన్ని కొందరు చూశారు. అంతే.. భయంతో హడలిపోయారు. దీంతో ఎంతో వేడుకగా జరుగుతున్న పెళ్ళి వేడుక కాస్త రసాభాసగా మారిపోయింది.
దీనిపై సమచారం అందుకున్న కాన్పూరు అటవీశాఖ అధికారులు అగ్నిమాపక, పశువైద్యులతో వచ్చి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. సుమారు 200 నిమిషాల పోరాటం తర్వాత ఆ పులిని బంధించారు. చిరుత పులి భయంతో తాత్కాలికంగా వాయిదాపడిన పెళ్లి ఆ తర్వాత యధావిధిగా జరిగింది. అటవీశాఖ అధికారులు, పోలీసులు సకాలంలో స్పందించి ఘటనా స్థలానికి చేరుకుని ఆ చిరుత పులిని బంధించడంతో ప్రతి ఒక్కరూ ఊపిరిపీల్చుకున్నారు. అలాగే, అటవీశాఖ అధికారులను అభినందిస్తున్నారు.