పవన్‌తో లక్ష్మీనారాయణ అర్థరాత్రి చర్చలు.. నేడు జనసేనలోకి...
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్ని రోజులుగా ఈయన పేరు రాజజకీయాల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆయన శనివారం అర్థరాత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. ఈ చర్చల తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
నిజానికి సీబీఐ జేడీగా ఎన్నో సంచలన కేసులను దర్యాప్తు చేసిన ఆయన.. 2018 మార్చిలో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి సొంత రాష్ట్రానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఏపీలో పర్యటిస్తున్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి, వారి కష్టాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఒకానొక సమయంలో సొంత పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరుతారని వార్తలు వినిపించాయి. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ మాజీ జేడీతో చర్చలు జరిపారని, ఆయనకు భీమిలి అసెంబ్లీ సీటు కానీ, విశాఖ ఎంపీ టికెట్ కానీ కేటాయించనున్నారని పుకార్లు షికార్లు చేశాయి. వీటన్నింటికి పుల్‌స్టాప్ పెడుతూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు.