1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2020 (09:10 IST)

జూపూడి, డొక్కాలు మేథావుల ముసుగేసుకున్న మేతావులు: మాజీ మంత్రి జవహర్

గాంధీ జయంతి నాడు వైసీపీనేతలు, “సత్యమునే పలుకుము, అహింసను వీడుము”  అనేసిద్ధాంతానికి తిలోదకాలు ఇచ్చారని, దళిత మేథావులని చెప్పుకుంటున్న అధికారపార్టీలోని కొందరు మేతావులు తమరాజకీయ, ఆర్థిక, వ్యక్తిగత ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసం పనిచేస్తున్నారని, వారిలో జూపూడిప్రభాకర్ రావు, డొక్కా మాణిక్యవరప్రసాద్ లు అగ్రస్థానంలో నిలిచారని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి కే.ఎస్. జవహర్  ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
"ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి, ప్రజల అభీష్టానికి అనుగుణంగా పనిచేయాల్సిన వారు, రాజ్యాంగాన్ని పరిహాసించేలా మాట్లాడటం శోచనీయం. స్వయంప్రకటిత మేథావులుగా ప్రకటించుకున్న వైసీపీలోని మేతావులైన డొక్కా మాణిక్య వరప్రసాద్, జూపూడి ప్రభాకర్ రావు చిలుకపలుకులు పలుకుతు న్నారు. దళితులపై దాడులు, శిరోముండనాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నప్పుడు వారు మౌనమునుల్లా ఎందుకున్నారు?

వర్గీకరణకు వ్యతిరేకమైన జగన్మోహన్ రెడ్డి పంచన  డొక్కా ఎలా చేరాడో చెప్పాలి. సమాజానికి లోకువ అయ్యేలా డొక్కాలాంటి వారు ప్రవర్తించడం సరికాదు. ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలను డొక్కా ఎందుకు ప్రశ్నించడంలేదు. లాయర్ అయిన డొక్కా, జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను సమర్థిస్తూ, న్యాయవ్యవస్థలను తప్పుపట్టడం ఏమిటి?

డొక్కా వ్యాఖ్యలు చూస్తుంటే, ఆయన తీసుకున్న న్యాయవాది పట్టాపై కూడా తమకు అనుమానం కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రాపకం పొంది మంత్రి పదవి పొందాలనుకోవడం తప్పుకాదుగానీ, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులపై వారిరువురూ ఆలోచన చేయాలి. 

వాలంటీర్ వ్యవస్థ పనితీరుపై డప్పులు, చప్పట్లు కొట్టాలంటున్న సజ్జల సహా, వైసీపీలోని ఏనేతకూ డప్పు పట్టుకొనే అర్హత లేదు. చర్మకారులకు, చెప్పులుకుట్టేవారికి, డప్పుకొట్టుకునేవారికి న్యాయంగా అందాల్సిన పింఛన్లను ఆపేసిన ప్రభుత్వంలో,  ఆ అర్హత ఎవరికీ లేదు. న్యాయం కోసం మోగే డప్పు, వైసీపీ ప్రభుత్వంలో అన్యాయానికి బలవుతోంది. 

తమ మేథస్సును వైసీపీ అనే బురద గుంటలో పోసిన డొక్కా, జూపూడి వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? బురదగుంటలో పన్నీరు కలిస్తే ఏమవుతుందో వారు తెలుసుకోవాలి. చీరాలలో దళిత యువకుడిని కొట్టి చంపిన ఘటన, శిరోముండనం ఘటన, డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, జడ్జీ రామకృష్ణల ఉదంతాల గురించి ప్రభాకర్ రావు, మాణిక్యవరప్రసాద్ మాట్లాడాలి.

వివక్షతో కూడిన వ్యవస్థల గురించి వారు ప్రశ్నించాలి. డొక్కా, జూపూడి అధికారం ఉన్నంతకాలం చంద్రబాబు చుట్టూ తిరిగారు, కులాలను అడ్డుపెట్టుకొని ఎదగాలని చూస్తున్నారు. అటువంటి వారు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని, వ్యవస్థల పక్షాన నిలిస్తే మంచిది. తమపరిధిని జగన్మోహన్ రెడ్డికి భజన చేయడానికే వారు పరిమితం చేశారు.

వైసీపీలోని దళితనేతలంతా ఎందుకూ పనికిరారని ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. జగన్ ప్రాపకంకోసం, ఆయన చుట్టూ తిరుగుతూ, దళితులను అవమానిస్తున్న వారందరికీ, సదరు దళితులే తగినవిధంగా బుద్ధిచెబుతారు. జూపూడి, డొక్కా వైసీపీప్రభుత్వం దళితజాతిపై చేస్తున్న దాడులను ఆపేలా జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలని కోరుతున్నాం.