1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 11 జులై 2025 (18:15 IST)

కాకినాడ రంగరాయ వైద్య కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థినులపై సిబ్బంది లైంగిక వేధింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడలోని రంగరాయ వైద్య కాలేజీలో ర్యాగింగ్ భూతం వెలుగు చూసింది. ఇక్కడ విద్యాభ్యాసం చేసే కొందరు విద్యార్థినిల పట్ల సిబ్బంది కొందరు అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం. ఇది కాలేజీలో కలకలం రేపింది. ఇటీవలే గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ వైద్య కాలేజీలో ర్యాగింగ్ బహిర్గతమైంది. దీంతో 15 మంది విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిలో డీన్ కుమారుడు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన మరిచిపోకముందే ఇపుడు కాకినాడలోని రంగరాయ వైద్య కాలేజీలో ఈ ర్యాగింగ్ ఘటన వెలుగు చూసింది.
 
ఈ కాలేజీలో బీఎస్సీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులు చదువుతున్న విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నారని బాధిత విద్యార్థినులు కొందరు ఫ్యాకల్టీ వద్ద చెప్పుకుని విలపించారు. ఇదే విషయమై ప్రిన్సిపాల్‌‍కు ఫిర్యాదు అందడంతో ఆయన తీవ్రంగా పరిగణించి అంతర్గత కమిటీ శ్రీ ద్వారా విచారణ చేయించారు. మైక్రో బయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు చెప్పారు. 
 
విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సిబ్బందిలో ఇద్దరు బెదిరించినట్టు కూడా తెలిసింది. తాను శాశ్వత ఉద్యోగినని, తనను ఎవరూ ఏమీ చేయలేరని ల్యాబ్ సహాయకుడు ఒకరు విద్యార్థినులను బెదిరించినట్టు కూడా సమాచారం. అంతేకాదు, కొందరు ల్యాబ్ అసిస్టెంట్లు విధులకు మద్యం తాగి వస్తున్నారని కూడా కమిటీకి తెలిపారు. 
 
అయితే, తాము ఎవరిపట్లా అసభ్యంగా ప్రవర్తించలేదని విచారణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బంది చెప్పినట్టు తెలిసింది. వేధింపుల వ్యవహారం నిజమేనని, విచారణ జరిపించామని, ఇందుకు సంబంధించి నలుగురు సిబ్బందిపై సస్పెండ్ వేటు వేశారు.