సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 జూన్ 2022 (11:00 IST)

జూలై ఒకటో తేదీన కొత్త పింఛన్ల మంజూరు లేనట్టే

pension money
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ పింఛను కానుక కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి జులై 1వ తేదీన కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సివుంది. కానీ ఈ దఫా ఆ పరిస్థితి కనిపించడం లేదు. వీరికి జులై 19న మంజూరు పత్రాలు ఇస్తామని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) సీఈవో ఇంతియాజ్‌ తెలిపారు. 
 
ఈ పత్రాలను అదేరోజు ఇస్తారా లేక మరో రోజు ఇస్తారా అన్నది స్పష్టత లేదు. దీంతో దాదాపు 3 లక్షల మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. ఏడాదికి రెండు విడతల్లో ఆరు నెలలకొకసారి (జులై, జనవరి) కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకారం ఈ ఏడాది జనవరిలో కొత్త పింఛన్లను మంజూరు చేసింది. 
 
అప్పటి నుంచి జూన్‌ వరకు దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. వాటిని ఇప్పటికే రెండు విడతలుగా తనిఖీ చేసి దాదాపుగా 3 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. వివిధ సంక్షేమ పథకాలకు అర్హత ఉన్నా వివిధ కారణాలతో లబ్ధి అందని వారికి జులై 19న ఆ సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగా మంజూరు పత్రాలు అందిస్తామని అధికారులు వెల్లడించారు.