శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 14 మే 2021 (20:23 IST)

కరోనా మృతులకు అన్నీ తామై అంత్యక్రియలు, హ్యాట్సాఫ్ ముస్లిం జెఎసి

కరోనా మహమ్మారితో మృతి చెందుతున్న వారి అంతిమ సంస్కారాలు చేయడానికి కొందరు భయపడుతున్నారు. కొన్నిచోట్ల అందరూ ఉండి అంతిమ సంస్కారాలను నిర్వహించలేకపోతున్నారు. దీంతో తిరుపతికి చెందిన కొంతమంది ముస్లిం యువత జెఎసిగా ఏర్పడింది. కరోనాతో మృతి చెందిన వారి మృతదేహాలకు అంతిమ సంస్కారం చేస్తోంది. వారి ఆత్మక్షోభకు గురికాకుండా కాపాడే విధంగా చేస్తున్నారు ముస్లిం జెఎసి సభ్యులు.
 
తిరుపతిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో ప్రతిరోజు పది మందికి పైగానే కరోనా రోగులు మృతి చెందుతున్నారు. అయితే మృతి చెందిన వారికి బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కొంతమంది మాత్రమే తమ వారి మృతదేహాలను ఇంటికి తీసుకెళ్ళి సాంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తున్నారు. మరికొంతమంది మాత్రం కరోనాతో చనిపోవడంతో భయపడి మృతదేహాలను అలాగే వదిలేస్తున్నారు. 
 
దీంతో అనాధ శవాలుగా మారిపోయిన కరోనా మృతదేహాలను అన్నీ తామై తిరుపతికి చెందిన యునైటెడ్ ముస్లిం అసోసియేషన్ సభ్యులు అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారు. కుల, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని యునైటెడ్ ముస్లిం జెఎసి చేపట్టింది. 20 మంది సభ్యులతో మొదట్లో ప్రారంభమైన ఈ జెఎసి అనతి కాలంలోనే 60 మంది సభ్యులను చేరుకుంది.
 
నగరంలో కరోనాతో మరణించిన వారి మృతదేహాలను దగ్గరుండి తీసుకువచ్చి వారి మతం ప్రకారం సాంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నారు. 2014 సంవత్సరంలో మొదటగా ప్రారంభమైన ఈ జెఎసి అప్పటి నుంచి ప్రజాసేవలో నిమగ్నమైందన్నారు జెఎసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.డి.గౌస్. 2020 సంవత్సరం నుంచి కరోనాతో మృతి చెందిన వారికి అంతిమ సంస్కారాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 
 
సంవత్సరానికి పైగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామన్నారు. మొదట్లో ఆంబులెన్స్ సమస్య ఎక్కువగా ఉండేదని.. దాతల విరాళాలతో రెండు ఆంబులెన్స్‌లను కొని ప్రస్తుతం వాటిలోనే ఈ మృతదేహాలను స్మశానవాటికలకు తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కరోనాతో చనిపోతే సొంత కుటుంబసభ్యులే దగ్గరికి రాని ఈరోజుల్లో ముస్లిం యువత కలిసికట్టుగా చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం. ఈ ముస్లిం జెఎసికి మనమూ కతజ్ఞతలు తెలుపుకుందాం.