శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (17:46 IST)

కేశినేని నాని పార్టీ మారడం లేదు : గల్లా జయదేవ్

విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్టీ మారడం లేదని టీడీపీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. నాని పార్టీ మారుతున్నట్టుగా సాగుతున్న ప్రచారం కేవలం పుకార్లేనని ఆయన చెప్పారు. నాని పార్టీ మారబోతున్నారనీ, అందుకే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన లోక్‌సభ టీడీపీ ఉప నేత పదవిని నాని తిరస్కరించారంటూ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో నానితో గల్లా జయదేవ్ బుధవారం సమావేశమయ్యారు. ఆ తర్వాత గల్లా జయదేవ్ పైవిధంగా మాట్లాడారు. 
 
మరోవైపు, టీడీపీ అధిష్టానంపై ఎంపీ కేశినేని నాని అలక బూనినట్టు సమాచారం. పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్, లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రామ్మెహన్ నాయుడును నియమించిన పార్టీ అధినేత చంద్రబాబు.. పార్టీ విప్‌గా కేశినేని నానిని ఎంపిక చేశారు. అయితే ఈ పదవిపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలంటూ తెలిపారు. కానీ ఈ పదవిని తాను స్వీకరించలేనని.. తాను అంత సమర్ధుడిని కాదంటూ కేశినేని నాని పరోక్షంగా అధినేత నిర్ణయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
అంతేకాకుండా పార్టీలో సమర్థవంతమైన నేతలకు ఈ పదవులు ఇవ్వండి అంటూ ఆయన సలహా ఇచ్చారు. ఇక తాను బీజేపీలో చేరుతున్నానన్న వార్తలు అవాస్తవమన్న ఆయన.. తనకు ఆ అవసరం లేదంటూ పేర్కొన్నారు. అయితే పార్టీలో తనకు ప్రాధాన్యం కల్పించడం లేదంటూ గత కొన్నిరోజులుగా అసంతృప్తితో ఉన్న కేశినేని.. ఇటీవల ఆయన నియోజకవర్గంలో చంద్రబాబు నిర్వహించిన ఇఫ్తార్ విందుకు గైర్హాజరైన విషయం తెలిసిందే.