అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో... గాన గంధర్వ బాలు ప్రథమ వర్ధంతి
గాన గంధర్వుడు, గాత్ర బ్రహ్మ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మృతి చెంది అపుడే ఏడాది గడిచిపోయింది. ప్రముఖ చలన చిత్ర గాయకుడు గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతిని దివిసీమలో ఘనంగా నిర్వహించారు. దివిసీమ లలిత కళా సమితి ఆధ్వర్యంలో అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా లలిత కళా సమితి అధ్యక్షులు పుప్పాల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి కూనపరెడ్డి చంద్రశేఖర రావు మాట్లాడుతూ, పాట ఉన్నంత కాలం బాల సుబ్రమణ్యం జీవించే ఉంటారని అన్నారు. బాల సుబ్రహ్మణ్యం పాటలు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించాయని, ఐదు దశాబ్దాల పాటు దాదాపు అన్ని భాషలలో 40 వేల పాటలు పాడి ఎన్నోఅవార్డులు అందుకున్న బాలు చిరస్మరణీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక గాయని ఎన్. జ్యోతి, బాలసుబ్రహ్మణ్యం అభిమానులు, గాయకులు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించారు.