మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2019 (17:52 IST)

గాంధీ కుటుంబానికి మోడీ సర్కారు షాక్... ఇది ప్రతీకార చర్యేనంటున్న కాంగ్రెస్

గాంధీ కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తేరుకోలేని షాకిచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు కల్పిస్తూ వచ్చిన ఎస్.పి.జి. (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) భద్రతను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం వారికున్న ఎస్‌పీజీ భద్రతను ఉపసంహరించి, జడ్ ప్లస్ కేటిగిరి భద్రత కల్పించనున్నట్టు ప్రభుత్వ వర్గాల తాజా సమాచారం. ప్రధాని, రాష్ట్రపతికి మాత్రమే ఎస్‌పీజీ భద్రత ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఎస్‌పీజీ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. 
 
మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ స్పందిస్తూ, కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. గాంధీల ప్రాణాలతో కేంద్రం రాజీ పడుతోందన్నారు. ఎస్‌పీజీ భద్రత తొలగించడం వల్ల గాంధీ కుటుంబ సభ్యులను తేలికగా టార్గెట్ చేసే అవకాశాలుంటాయని, వారు ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.